ఖైరతాబాద్‌లో కొలువుదీరిన 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులకు ఈ నెల 23వ తేదీ వరకు అవకాశం ఉండనుంది. బుధవారం అర్ధరాత్రి తర్వాత దర్శనాలను నిలిపివేయనున్నారు. అనంతరం నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లపై ఉత్సవ నిర్వాహకులు దృష్టి సారించనున్నారు. 24వ తేదీన మహాగణపతి చుట్టూ ఏర్పాటు చేసిన షెడ్డు, రక్షణ కంచెలను తొలగించనున్నారు. నిమజ్జన శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు లేకుండా మార్గాన్ని సిద్ధం చేయనున్నారు. దీంతోపాటు విగ్రహాన్ని తరలించేందుకు అవసరమైన ఇతర ఏర్పాట్లను కూడా పూర్తి చేయనున్నారు.
ఈ నెల 25న ఉదయం నుంచే ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో విగ్రహాన్ని కదిలించి, వీలైనంత త్వరగా శోభాయాత్రను పూర్తి చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలలోపే హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం పూర్తిచేయాలనే లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం హుస్సేన్‌సాగర్‌లోనే జరగనుంది. భారీ విగ్రహం కావడంతో నిమజ్జన ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
హైదరాబాద్‌లో ఇప్పటికే పలు ప్రాంతాల్లో గణేశ్ విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది. అయితే ప్రధాన నిమజ్జన రోజైన 25న నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విగ్రహాలు ప్రధాన మార్గాల మీదుగా తరలిరానున్నాయి. గతంలో వెల్లడైన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరవ్యాప్తంగా సుమారు 1.5 లక్షల గణేశ్ మండపాలు ఏర్పాటు కాగా, దాదాపు 50 లక్షల మంది భక్తులు ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం ఉందని అంచనా. దీంతో ప్రధాన నిమజ్జన రోజున నగరంలో భారీగా రద్దీ ఏర్పడే అవకాశం ఉంది.
హుస్సేన్‌సాగర్‌తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లోనూ నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సరూర్‌నగర్, కాప్రా, అమీన్పూర్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక నిమజ్జన ప్రాంతాలను సిద్ధం చేస్తున్నారు. నగర వ్యాప్తంగా 150కిపైగా నిమజ్జన ప్రాంతాలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు సుమారు 110 చిన్న నీటి కొలనులను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. దీంతో పెద్ద చెరువులు, సరస్సులపై ఒత్తిడి తగ్గించడంతో పాటు స్థానిక ప్రాంతాల్లోనే చిన్న విగ్రహాల నిమజ్జనం పూర్తిచేసేలా చర్యలు చేపడుతున్నారు. ఖైరతాబాద్ ప్రాంతంలో ఈ నెల 23 వరకు భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే పలు మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉన్నాయి. ఇక 25న జరిగే భారీ నిమజ్జన శోభాయాత్రను దృష్టిలో పెట్టుకుని నగరంలోని ప్రధాన రహదారుల్లో మరిన్ని ఆంక్షలు, మళ్లింపులు అమలు చేయనున్నారు.
శోభా యాత్ర సాగే మార్గాల్లో వాహనాల రాకపోకలను నియంత్రించడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలను అందుబాటులో ఉంచేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు, వాహనదారులు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకుని పోలీసుల సూచనలను పాటించాలని అధికారులు కోరుతున్నారు. మొత్తంగా ఈసారి నిమజ్జనోత్సవాన్ని ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా, సాధ్యమైనంత తక్కువ సమయంలో పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా హుస్సేన్‌సాగర్ వద్ద నిమజ్జన ప్రక్రియ వేగంగా జరిగేలా అదనపు సదుపాయాలను సిద్ధం చేస్తున్నారు.




