Headlines

Hyderabad: మాదాపూర్‌లో విషాదం.. కో-లివింగ్ హాస్టల్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి!


హైదరాబాద్ హైటెక్ సిటీ పరిధిలోని మాదాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ కో-లివింగ్ హాస్టల్‌లో ఉంటున్న 23 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భవనం నుంచి కిందకు దూకి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మృతుడిని శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన యశ్వంత్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

యశ్వంత్ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇటీవలే మాదాపూర్‌లోని కో-లివింగ్ హాస్టల్‌లో చేరినట్లు పోలీసులు తెలిపారు. సుమారు పది రోజుల క్రితమే అతడు హాస్టల్‌లోకి వచ్చినట్లు సమాచారం. మంగళవారం (సెప్టెంబర్ 13) ఉదయం యశ్వంత్ తన ఆరోగ్యం బాగోలేదని తోటి వారికి చెప్పినట్లు తెలుస్తోంది. అనంతరం బ్లడ్ చెకప్ చేయించుకున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే హాస్టల్ భవనం నుంచి కిందకు దూకినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యశ్వంత్ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి హాస్టల్‌లోని సీసీటీవీ దృశ్యాలు, ఇతర వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. పూర్తి దర్యాప్తు అనంతరం ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *