Headlines

Duleep Trophy 2026: దులీప్ ట్రోఫీలో నం.1 ఇషాన్ కిషన్, నం.3 వైభవ్ సూర్యవంశీ.. టాప్ 5 ప్లేయర్లు వీళ్లే


Duleep Trophy 2026: చెన్నైలోని ప్రసిద్ధ ఎంఏ చిదంబరం స్టేడియంలో సౌత్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ విధ్వంసకర సెంచరీతో సత్తా చాటారు. జట్టుకు అత్యంత అవసరమైన సమయంలో క్రీజులోకి వచ్చి బాధ్యతాయుతంగా ఆడుతూనే, సౌత్ జోన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. మ్యాచ్ సమయంలో 160కి పైగా పరుగులు చేసి క్రీజులో నిలిచిన ఆయన, డబుల్ సెంచరీ దిశగా అడుగులు వేశారు. ఈ క్రమంలో ఈ సీజన్‌లో 200 పరుగుల మైలురాయిని దాటిన ఏకైక బ్యాటర్‌గా రికార్డు పుటలకెక్కారు. మొత్తం 109 సగటుతో 218 పరుగులు సాధించి టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన రన్ మెషిన్‌గా అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు.

టాప్-3లో చోటు దక్కించుకున్న వైభవ్ సూర్యవంశీ

ఈస్ట్ జోన్ యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఫైనల్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని స్వల్పంలో చేజార్చుకున్నారు. అవుటయ్యే ముందర 44 పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, ఒక అద్భుతమైన సిక్సర్ సాధించి అలరించారు. ఈ మెరుపు ఇన్నింగ్స్ బలంతో ఈ సీజన్‌లో మొత్తం 184 పరుగులు ఖాతాలో వేసుకుని, టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నారు.

టాప్-5 రన్ స్కోరర్లు ఈస్ట్ జోన్ నుంచే

విశేషమేమిటంటే దులీప్ ట్రోఫీ 2026 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన మొదటి ఐదుగురు ఆటగాళ్లు కూడా ఈస్ట్ జోన్ జట్టుకు చెందినవారే కావడం విశేషం. ఈ జాబితాలో ఇషాన్ కిషన్ 218 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. సుదీప్ కుమార్ 191 పరుగులతో రెండవ స్థానంలో నిలిచారు. వైభవ్ సూర్యవంశీ 184 పరుగులతో మూడవ స్థానంలో ఉండగా, అభిమన్యు ఈశ్వరన్ 180 పరుగులతో నాల్గవ స్థానాన్ని దక్కించుకున్నారు. అభిమన్యు ఈశ్వరన్ ఫైనల్లో ఓపెనర్‌గా వచ్చి 72 పరుగుల హాఫ్ సెంచరీ నమోదు చేశారు. ఇక కుమార్‌ కుషాగ్ర కూడా ఫైనల్లో అద్భుత సెంచరీతో మెరిసి మొత్తం 178 పరుగులతో ఐదో స్థానంలో నిలిచారు.

భారీ స్కోరు దిశగా ఈస్ట్ జోన్

కెప్టెన్ ఇషాన్ కిషన్, కుమార్ కుషాగ్ర సెంచరీలతో పాటు ఓపెనర్లు అందించిన అద్భుతమైన పునాదితో ఈస్ట్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 490 పరుగుల భారీ స్కోరు సాధించింది. సౌత్ జోన్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ, మొదటి ఇన్నింగ్స్‌లోనే 600కి పైగా పరుగులు సాధించి మ్యాచ్‌ను తమ గుప్పెట్లోకి తెచ్చుకోవాలనే పట్టుదలతో ఈస్ట్ జోన్ ఆటగాళ్లు కనిపిస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *