ఇష్టమైన ఆహారం విషయంలో భార్యభర్తల మధ్య జరిగిన చిన్న వివాదం చివరకు ఒకరి ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా కనగల్ మండలం షాబ్దుల్లాపురం గ్రామానికి చెందిన కారింగు లింగయ్య, లింగమ్మ దంపతులు కూలి నాలి చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా.. వారికి వివాహాలు కావడంతో అత్తారింటికి వెళ్లిపోయారు. దీంతో ఇంట్లో భార్యాభర్తలిద్దరే ఉంటున్నారు. లింగమ్మ కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని నడిపించడంలో భర్తకు సహకరిస్తోంది.
అయితే లింగయ్యకు పంది మాంసం తినే అలవాటు ఉంది. దీంతో పంది మాంసం కోసం భార్య లింగమను డబ్బులు అడిగాడు.. కానీ శ్రావణ మాసం కావడంతో ఇంట్లోకి పంది కూర తీసుకురావడం ఇష్టం లేని లింగమ్మ భర్తకు డబ్బు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఇంట్లో జరిగిన గొడవను గమనించిన ఇరుగు పొరుగు వారు ఇద్దరికీ నచ్చజెప్పడంతో అప్పటికి గొడవ సద్దుమణిగింది.
కానీ.. ఆ వివాదం లింగయ్య మనసులో మాత్రం అలాగే ఉండిపోయింది. ఆ కొద్ది పాటి కోపంలో 66 ఏళ్ల తమ వివాహ బందాన్ని మరిచిన లింగయ్య రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న లింగమ్మపై దాడికి దిగాడు. భర్త దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలుసుకొని ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసినట్లు కనగల్ ఎస్సై రాజీవ్ రెడ్డి తెలిపారు. చిన్న కుటుంబ కలహాలు ఎంతటి విషాదానికి దారితీస్తాయో చెప్పే మరో ఘటనగా ఇది నిలిచింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.