బ్యాంక్ అకౌంట్ ఉన్నా, లైఫ్, టర్మ్ ఇన్సూరెన్స్ లాంటి పాలసీలు తీసుకున్నా నామినీ వివరాలు అందించడం అనేది తప్పనిసరి. నామినీ వివరాలు అందించకపోతే మీరు పాలసీలు తీసుకున్నా వృధానే. మీకు ప్రమాదవశాత్తూ ఏదైనా జరిగితే కుటుంబానికి, నామినీకి సొమ్ము అందుతుంది. సాధారణంగా కుటుంబసభ్యులను నామినీగా చేరుస్తారు. భర్త, భార్య, కుమారుడు, కుమార్తెల పేర్లను నామినీల జాబితాలో జోడిస్తారు. దీంతో పాలసీదారుడు మరణిస్తే వారికి ఇన్సూరెన్స్ నగదు అందిస్తారు. అయితే చాలామందికి ఒక అనుమానం ఉంటుంది. పాలసీదారుడు, నామినీ ఇద్దరూ చనిపోతే డబ్బులు ఎవరికి అందుతాయి? అనే డౌట్ ఉంది. దీనికి సమాధానాలు ఇందులో చూద్దాం.
నామినీ కూడా చనిపోతే ఏమవుతుంది..?
ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు ప్రధాన నామినీతో పాటు సెకండరీ నామినీకి కూడా చేర్చాలి. చాలామంది ఒక్క పేరును మాత్రమే చేర్చుతారు. దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి. అదే ప్రత్యామ్నాయ నామినీని కూడా చేర్చడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. పాలసీదారుడు, ప్రధాన నామినీ ఇద్దరు మరణిస్తే.. సెకండరీ నామినీకి క్లెయిమ్ చెల్లిస్తారు. దీంతో సెకండరీ నామినీని కూడా పొందుపర్చడం అత్యంత ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ సెకండరీ నామినీ పేరు లేకపోతే ఇన్సూరెన్స్ సొమ్మును చట్టబద్ద వారసులు క్లెయిమ్ చేసుకునే అవకాశముంది. భారతదేశ వారసత్వ చట్టాల ప్రకారం వారసులకు పొందే హక్కు ఉంటుంది. తల్లిదండ్రులు మరణిస్తే.. వారి పిల్లలు, చట్టబద్దమైన వారసులు క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే వారసత్వాన్ని నిరూపించుకునేందుకు అవసమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. దీంతో ఈ ప్రక్రియ చాలా కష్టతరంగా ఉంది.
తమ వారసత్వాన్ని నిరూపించుకునేందుకు లీగల్ హెయిర్ సర్టిఫికేట్, సక్సెషన్ సర్టిఫికేట్ లాంటివి సమర్పించాల్సి ఉంటుంది. ఇక డెట్ సర్టిఫికేట్, పోలీస్ ఎఫ్ఐఆర్ కాపీ, పోస్టు మార్టం రిపోర్ట్ లాంటి పత్రాలను సమర్పించాలి. మరణించిన వ్యక్తి ఆస్తులు, ప్రయోజనాలపై ఎవరికి చట్టబద్దమైన హక్కు ఉండో నిర్ధారించే డాక్యుమెంట్లను అందించాల్సి ఉంటుంది. ఒకవేళ క్లెయిమ్ చేసుకునే వ్యక్తి మైనర్ అయితే.. వారి తరపున సంరక్షకుడు క్లెయిమ్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ ఇబ్బందులన్నీ ఎదుర్కొకుండా ఉండాలంటే సెకండరీ నామినీని పొందుపర్చడం అనేది తప్పనిసరి అని చెప్పవచ్చు. దీని వల్ల భవిష్యత్తులో కుటుంబసభ్యులు సులభంగా క్లెయిమ్ పొందవచ్చు. ప్రస్తుతం చాలామంది ఒక్క నామినీకి మాత్రమే పొందుపరుస్తున్నారు. దీంతో కుటుంబసభ్యులు క్లెయిమ్ పొందటం కష్టతరంగా మారుతుంది. ఇన్యూరెన్స్ పాలసీలకు మాత్రమే కాకుండా బ్యాంక్ అకౌంట్కు కూడా ఇద్దరు నామినీల పేర్లను ఇవ్వాలి. మరణించిన తర్వాత నామినీలు మీ అకౌంట్లోని డబ్బులను పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది.