భారతీయులకు బంగారం అంటే ఎంత పిచ్చి అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పండుగలు, పెళ్లి, పంక్షన్లు అంటే చాలు గోల్డ్ గురించే ముందు ఆలోచిస్తారు. ఎలాంటి బంగారం ధరించాలనేది ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు. ఎవరికైనా ఖరీదైన గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే బంగారు ఆభరణాలను ఇస్తూ ఉంటారు. ఇక వారసత్వంగా కూడా బంగారాన్ని పొందుతూ ఉంటారు. దేశంలో సాధారణంగా ప్రతీ భారతీయుడి ఇళ్లల్లో ఎంతోకొంత బంగారం ఉంటుంది. గోల్డ్‌ను తమ ఇళ్లల్లో దాచుకుంటూ ఉంటారు. అయితే పెద్ద మొత్తంలో గోల్డ్‌ను ఇళ్లల్లో దాచుకుంటే ఇబ్బందులు వస్తాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇందుకు ఇన్‌కమ్ ట్యాక్స్ కొన్ని నిబంధనలు విధించినట్లు చెబుతూ ఉంటారు. ఎక్కువ మొత్తంలో ఇంట్లో భద్రపర్చుకుంటే ఐటీ డిపార్ట్‌మెంట్ నుంచి చిక్కులు కూడా ఎదురయ్యే అవకాశముందంటూ అపోహ పడుతుంటారు. కొన్నిసార్లు సీజ్ చేసే అవకాశం కూడా ఉంటుందని కొంతమంది భయపడుతుంటారు. ఐటీ నిబంధనలు ఏం చెబుతున్నాయనేది చూద్దాం.
ఐటీ నిబంధనలు ఇవే..
ఐటీ నిబంధనల ప్రకారం పెళ్లి అయిన మహిళ తన దగ్గర 500 గ్రాముల వరకు బంగారం ఎలాంటి ఆధారాలు లేకుండా ఉంచుకోవచ్చు. ఇక అవివాహిత మహిళ అయితే 250 గ్రాముల వరకు ఉంచుకోవచ్చు. ఇక పెళ్లి చేసుకోని పురుషుడు తన వద్ద 100 గ్రాముల వరకు ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఉంచుకోవచ్చు. అయితే ఇంతకంటే ఎక్కువ బంగారం కలిగి ఉంటే మీ దగ్గర అది ఎక్కడ నుంచి వచ్చిందనే ఆధారాలు కలిగి ఉండాలి. ఆ బంగారానికి సంబంధించిన బిల్లులు, ప్రూఫ్‌లు, డాక్యుమెంట్స్ ఉంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొనుగోలు చేసిన బిల్లులు, బ్యాంక్ ట్రాన్సాక్షన్లు, గిఫ్ట్ డీడ్స్, వారసత్వ పత్రాలు లాంటివి ఉంటే సరిపోతుంది. అయితే మీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోతే ఐటీ శాఖ నుంచి ఇబ్బందులు రావొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారాన్ని సీజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టినప్పుడు మీ దగ్గర ఆధారాలు ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఎంతైనా ఇంట్లో ఉంచుకోవచ్చా..?
ఇంట్లో ఎంత బంగారం అయినా ఉంచుకోవచ్చు. దానికి ఎలాంటి లిమిట్ అనేది లేదు. పరిమితికి మించి బంగారం ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు ఉండాలి. దీని వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆధారాలు లేకుండా ఇంట్లో ఉంచుకునే బంగారం పరిమితులు ఫైనల్ అని, ఆ పరిమితికి మంచి ఉంచుకోకూడదని చాలామంది అనుకుంటారు. అది నిజం కాదు. మీరు ఎంతైనా ఉంచుకోవచ్చు. కానీ పెద్ద మొత్తంలో దాచుకున్నప్పుడు అది ఎక్కడ నుంచి వచ్చిందనే ఆధారాలు ఉంచుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు.