మంచు దుప్పట్లు కప్పుకున్న హిమాలయ పర్వత శ్రేణులు.. పవిత్ర నదీ ప్రవాహాల సవ్వడులు.. పురాణ గాథల ఆనవాళ్లు.. వీటన్నింటి కలయికే మానా గ్రామం. ఇండో-టిబెట్ సరిహద్దుకు అతి సమీపంలో ఉండే ఈ చిన్న గ్రామాన్ని కొన్నేళ్ల క్రితం వరకు అందరూ భారతదేశపు చివరి గ్రామం అని పిలిచేవారు. కానీ ఇప్పుడు ఆ గుర్తింపు మారింది. సరిహద్దుల్లోని ప్రాంతాలు దేశానికి చివర కాదని, అవే మన దేశ ప్రవేశ ద్వారాలనే ఆలోచనతో ఈ గ్రామం అధికారికంగా భారతదేశపు మొదటి గ్రామంగా కొత్త పేరును సంతరించుకుంది. ఆధ్యాత్మికత, సాహసాలు, అద్భుత ప్రకృతి అందాల సమాహారమైన ఈ గ్రామం గురించి చాలా మందికి తెలియదు.
సముద్ర మట్టానికి 3,700 మీటర్ల ఎత్తులో జీవనం
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో సముద్ర మట్టానికి సుమారు 3,700 మీటర్ల ఎత్తులో మానా గ్రామం విస్తరించి ఉంది. ఇక్కడ ప్రధానంగా బోధి సమాజానికి చెందిన ప్రజలు నివసిస్తారు. ట్రాన్స్ హిమాలయ వాణిజ్యం, పర్వతారోహణలో వీరికి శతాబ్దాల నాటి గొప్ప చరిత్ర, సంప్రదాయాలు ఉన్నాయి. గ్రామీణ వాతావరణం, స్వచ్ఛమైన పర్వత గాలితో రద్దీగా ఉండే హిల్ స్టేషన్లకు భిన్నంగా ప్రశాంతమైన అనుభూతిని ఈ ఊరు అందిస్తుంది.
పురాణాల సంగమం.. సరస్వతి, వ్యాస గుహలు
మానా గ్రామానికి ఎంతో పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ప్రసిద్ధ చార్ధామ్ క్షేత్రమైన బద్రీనాథ్ ఆలయానికి ఇది కేవలం కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ప్రాచీన గ్రంథాలలో వర్ణించిన పౌరాణిక సరస్వతీ నది ప్రవాహాన్ని ఇక్కడే చూడవచ్చు. అలాగే వేద వ్యాసుడు మహాభారతాన్ని రచించినట్లుగా భావించే వ్యాస గుహ, ఆయన చెబుతుండగా గణపతి లిఖించినట్లు చెప్పే గణేష్ గుహలు ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. దీంతో బద్రీనాథ్‌కు వచ్చే భక్తులు తప్పకుండా మానా గ్రామాన్ని సందర్శిస్తుంటారు.
ట్రెక్కర్ల స్వర్గధామం
మంచు శిఖరాల నడుమ ఉండే మానా గ్రామం సాహస యాత్రికులకు, పర్వతారోహకులకు బెస్ట్ బేస్ క్యాంప్‌గా నిలుస్తుంది. ఇక్కడి నుంచి మొదలయ్యే అనేక ట్రెక్కింగ్ మార్గాలలో వసుధార జలపాతం ట్రెక్ అత్యంత ప్రసిద్ధి చెందింది. గ్రామం నుండి దాదాపు ఆరు కిలోమీటర్ల దూరం సాగే ఈ ట్రెక్కింగ్ మార్గం ప్రకృతి ప్రేమికులకు మధురానుభూతిని పంచుతుంది.
చేరుకోవడం ఎలా?
మానా గ్రామం జోషిమఠ్‌తో పాటు ఉత్తరాఖండ్‌లోని ఇతర ప్రధాన నగరాలకు రోడ్డు మార్గం ద్వారా అనుసంధానించబడి ఉంది.
- రైల్వే మార్గం: సమీప రైల్వే స్టేషన్ రిషికేశ్.
- విమాన మార్గం: సమీప విమానాశ్రయం డెహ్రాడూన్‌లోని జాలీ గ్రాంట్ .
- జోషిమఠ్ నుండి మానా గ్రామానికి సాగే పర్వత రహదారి ప్రయాణం అత్యంత సుందరమైన దృశ్యాలతో కనువిందు చేస్తుంది.
గ్రామంలో బస చేయడానికి సాధారణ గెస్ట్ హౌస్‌లు, ప్రాథమిక వసతులతో కూడిన లాడ్జీలు అందుబాటులో ఉంటాయి. ఒకప్పుడు సరిహద్దుల్లోని నిర్జన చివరి ప్రాంతంగా పరిగణించబడిన మానా, నేడు భారతదేశ సంస్కృతి, చరిత్ర, సరిహద్దు ఔన్నత్యానికి ప్రతీకగా నిలుస్తూ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.