Match Fixing: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ఊహించని సంచలనం చోటుచేసుకుంది. మూడో టెస్టు మ్యాచ్‌కు ముందు ఏడుగురు ఆటగాళ్లను, కోచ్‌ను జట్టు నుంచి తొలగించిన పీసీబీ ఇప్పుడు ఆటగాళ్ల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానాలకు తావిస్తోంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తీసుకుంటున్న వింత నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఇంగ్లాండ్‌తో కీలకమైన ఆఖరి టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. జాతీయ జట్టులోని కొందరు క్రికెటర్ల మొబైల్ ఫోన్‌లను బోర్డు అధికారులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఈ విచిత్ర చర్య వెనుక ఏదైనా పెద్ద అవినీతి లేదా మ్యాచ్ ఫిక్సింగ్ కోణం ఉందా అనే కోణంలో ప్రచారం జరుగుతుండటంతో క్రికెట్ వర్గాలు దిగ్భ్రాంతికి గురవుతున్నాయి.
పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ అంబర్ అలీ ఈ వివాదాస్పద విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్టు ముగిసే వరకు ఆటగాళ్ల ఫోన్లు బోర్డు వద్దే ఉంటాయని ఆమె పేర్కొన్నారు. అందరి ఫోన్లు జప్తు చేశారా లేక కొందరి ఫోన్లనే స్వాధీనం చేసుకున్నారా అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సంచలన పరిణామంపై పీసీబీ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయకపోవడం అనుమానాలను మరింత బలపరుస్తోంది. లోపల ఏదో పెద్ద వ్యవహారమే నడుస్తోందని అభిమానులు భావిస్తున్నారు.
సాధారణంగా అంతర్జాతీయ మ్యాచ్ జరిగే రోజుల్లో డ్రెస్సింగ్ రూమ్, మైదానం లాంటి ప్రదేశాల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై ఐసీసీ కఠిన ఆంక్షలు విధిస్తుంది. మ్యాచ్ సమయంలో సమాచార మార్పిడిని నిరోధించి, ఫిక్సింగ్ ఆస్కారం లేకుండా చూడటమే ఐసీసీ అవినీతి నిరోధక నిబంధనల ముఖ్య ఉద్దేశం. అయితే, రోజువారీ ప్రాక్టీస్ రోజుల్లో, మ్యాచ్ లేని సమయంలో కూడా బోర్డు అధికారులు ఆటగాళ్ల వ్యక్తిగత ఫోన్లను పూర్తిగా జప్తు చేయడం ఐసీసీ సాధారణ నిబంధనల పరిధిలోకి రాదు. బోర్డు చర్యలు క్రికెట్ ప్రపంచంలో కొత్త అనుమానాలకు దారితీశాయి.
ఐసిసి అవినీతి నిరోధక కోడ్ ప్రకారం.. విచారణకు అవసరమైన సమాచారం లేదా ఆధారాలు ఒక ఫోన్‌లో ఉన్నాయని అనుమానించడానికి తగిన కారణాలు ఉన్నప్పుడు మాత్రమే అధికారులు లిఖితపూర్వక ఆదేశాలతో పరికరాలను స్వాధీనం చేసుకుంటారు. ఇప్పుడు పీసీబీ కూడా అదే తరహాలో ఫోన్లు తీసుకోవడం చూస్తుంటే, ఏదో తీవ్రమైన అవినీతి లేదా ఫిక్సింగ్ వ్యవహారంపై రహస్యంగా విచారణ జరుపుతున్నారా అనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. గతంలోనూ పలుమార్లు ఫిక్సింగ్ భూతంలో చిక్కుకున్న పాకిస్థాన్ క్రికెట్‌కు ఇది మరో పెద్ద మచ్చగా మారే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..