Headlines

Andhra: వారెవ్వా.. సూపర్ ఐడియా రైతన్నా.. వరి పొలం గెట్లపై ఇలా..


ప్రస్తుత వ్యవసాయ రంగంలో ప్రతి ఏటా పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడులు, మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్న రైతులు నష్టాల సేద్యాన్ని లాభాల వైపు మళ్లించే మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో, సమీకృత వ్యవసాయ పద్ధతులు, పంటల సాగులో మార్పులు చేపడుతున్న రైతులు ఆశాకిరణంగా నిలుస్తున్నారు. ఒకప్పుడు రైతులు సాంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య, ఉద్యాన పంటలు, అనుబంధంగా పాడి, కోళ్లు, జీవాల పెంపకం వంటి సమీకృత వ్యవసాయాన్ని అనుసరించేవారు. పాడి పరిశ్రమ వ్యర్థాలను పంటలకు, పంట వ్యర్థాలను పాడికి ఉపయోగించుకుంటూ పెట్టుబడులు తగ్గించుకుని నాణ్యమైన దిగుబడులు సాధించేవారు. ఒకవేళ ప్రధాన పంట దెబ్బతిన్నా, అనుబంధ రంగాల ద్వారా ఆ లోటును భర్తీ చేసుకునేవారు. అయితే, వాణిజ్య పంటలకు మార్కెట్లో అధిక ధరలు లభించడంతో రైతులు ఏకపంట విధానానికి మొగ్గు చూపారు. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పుల కారణంగా ఒక్కోసారి పంటలు దెబ్బతిని పూర్తిగా నష్టపోయేవారు.

అయితే, విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం, గొల్లపల్లి గ్రామంలోని రైతులు ఈ ధోరణికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్‌లో వరి సాగు చేస్తూనే, వరి పొలాల గట్లపై అపరాలు, తీగ జాతి కూరగాయలను సాగు చేస్తున్నారు. చిక్కుడు, కంది, మునగ, అరటి, బంతి, బీర, బీన్స్ వంటి పంటలను గట్లపై పండిస్తున్నారు. ముఖ్యంగా బొరవ చిక్కుడు ఈ ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇది వర్షాకాలంలో పండించే ప్రధానమైన కూరగాయ పంట. ఈ వినూత్న పద్ధతి రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తోంది. రైతులు తమ ఇంటి అవసరాలకు సరిపడా కూరగాయలను పండించుకోవడమే కాకుండా, మిగిలిన ఉత్పత్తులను బొబ్బిలి వంటి స్థానిక మార్కెట్లలో విక్రయించి అదనపు ఆదాయం పొందుతున్నారు. ఒక రైతు ఐదు నుంచి పది వేల రూపాయల వరకు అదనపు ఆదాయం సంపాదిస్తున్నట్లు అంచనా. ప్రధాన పంట దిగుబడులు లేని సమయంలో ఇది వారికి జీవనోపాధిని అందిస్తోంది. వ్యవసాయ శాఖ అధికారులు ఈ అంతర పంటల సాగును విస్తృతంగా ప్రోత్సహిస్తున్నారు. రైతులు లాభాల బాట పట్టేందుకు వీలుగా కంది, మునగ, కూరగాయల విత్తనాలను రాయితీపై అందిస్తున్నారు. గట్లపై కంది సాగు విజయనగరం జిల్లాలో గత 10-15 సంవత్సరాలుగా అలవాటుగా ఉన్న పద్ధతే. దీనిని మరింత విస్తరింపజేసి కూరగాయల సాగును కూడా ప్రోత్సహిస్తున్నారు. ఈ పద్ధతి వలన అదనపు ఆదాయం రావడమే కాకుండా, ప్రధాన పంట అయిన వరికి చీడపీడల నివారణకు కూడా తోడ్పడుతుంది.

రసం పీల్చే పురుగులు, ముఖ్యంగా దోమ, పచ్చదోమ, గోధుమ రంగు దోమ వంటివి ముందుగా గట్లపై ఉన్న పంటలపై ఆశించడం వలన, ప్రధాన పంటకు ఎటువంటి హాని కలగకుండా రైతులు తగు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. శాస్త్రీయంగా వీటిని “రక్షక పంటలు” అని కూడా పిలుస్తారు. రైతులకు రక్షణ కల్పించడంతో పాటు, అదనపు ఆదాయాన్ని అందించే పంటలుగా ఇవి ఉపయోగపడుతున్నాయి. పోషక విలువల దృష్ట్యా మన ఆహారంలో అన్నంతో పాటు కూరగాయలు కూడా తప్పనిసరి. ఈ పద్ధతి రైతుల కుటుంబాలకు తాజా, పోషకమైన కూరగాయలను అందిస్తుంది. ఇది స్వయం సమృద్ధికి, ఆర్థిక స్థిరత్వానికి మార్గంగా నిలుస్తుంది. నష్టం జరిగినా, గట్లపై పండిన పంటల వలన ఇంటికి ఆదాయం, పోషకాహారం లభిస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ మంచి కార్యక్రమాన్ని మిగతా రైతులు కూడా అనుసరించడం ద్వారా సొంతంగా కూరగాయలు పండించుకునే అవకాశం కలుగుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *