Headlines

నీటి స్నానం కాదు.. పాల స్నానం కాదు.. ఒత్తిడిని తుడిచిపెట్టే అడవి స్నానం గురించి తెలుసా?


నీటి స్నానం, పాల స్నానం గురించి విన్న మనకు అడవి స్నానం లేదా జపనీస్ సంప్రదాయ షిరిన్-యోకు ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది. ఇది అడవిలో ఈత కొట్టడం కాదు… ప్రకృతితో మనస్సును మమేకం చేస్తూ పచ్చటి పరిసరాలలో గడపడం. నగర జీవితంలో ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమితో బాధపడేవారికి ఇది ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన ప్రకృతి చికిత్సగా ఉపయోగపడుతుంది.

అసలు ఏమిటీ అడవి స్నానం?:

1980లలో జపాన్‌లో ప్రారంభమైన ఈ పద్ధతిని అక్కడ షిరిన్-యోకు అని పిలుస్తారు. షిరిన్ అంటే అడవి, యోకు అంటే స్నానం. అంటే నీటితో శరీరాన్ని తడపడం కాకుండా, అటవీ వాతావరణంలో మన ఇంద్రియాలను పూర్తిగా నిమగ్నం చేయడం. ఈ పద్ధతిలో నదులలో ఈత కొట్టడమో లేదా కొండలు ఎక్కడమో ఉండదు. డిజిటల్ పరికరాలకు ఫోన్లు, కెమెరాలు దూరంగా ఉంటూ, పచ్చటి అడవిలో లక్ష్యం లేకుండా నెమ్మదిగా నడవడం, చెట్ల సువాసనలను పీల్చడం, పక్షుల కూతలు వినడం, ప్రకృతి శబ్దాలను గమనించడం మాత్రమే చేయాలి.

అడవి స్నానం చేయడం వల్ల శరీరంలో ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని పరిశోధనల్లో నిరూపితమైంది. చెట్లు తమ రక్షణ కోసం ఫైటోన్‌సైడ్స్ అనే సహజ నూనెలను విడుదల చేస్తాయి. వీటిని గాలి ద్వారా పీల్చినప్పుడు మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలపడటమే కాకుండా, క్యాన్సర్ కణాలతో పోరాడే నేచురల్ కిల్లర్ కణాలు పెరుగుతాయి. ఇది రక్తపోటు, హృదయ స్పందన రేటును సమతుల్యం చేసి, హృదయ సంబంధిత జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తైవాన్ విశ్వవిద్యాలయం పరిశోధన ప్రకారం, 2 గంటల అటవీ స్నానం వల్ల ఆందోళన, కోపం, నిరాశ తగ్గి మంచి నిద్ర పడుతుంది.

ఇవి కూడా చదవండి



అడవి స్నానం ఎలా చేయాలి?: దట్టమైన చెట్లు ఉన్న అడవిని లేదా ప్రశాంతమైన పచ్చటి పార్కును ఎంచుకోవాలి. ఫోన్లు, వాచ్‌లను స్విచ్ ఆఫ్ చేసి ప్రకృతి దృశ్యాలపై దృష్టి పెట్టాలి. చెట్ల బెరడును తాకుతూ, మట్టి వాసనను అనుభవిస్తూ ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయాలి. వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ ఆచరించదగిన ఈ ఆచారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. ప్రకృతి సమక్షంలో కొంత సమయం గడిపి శరీరాన్ని, మనస్సును పునర్నవీకరించుకుందాం..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *