Headlines

వాయమ్మో.. వంటగదిలోకి దూరిన గోధుమ నాగు.. దీన్ని మీరెప్పుడైనా చూశారా..?


పుట్టల్లో, పొదల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆహారం కోసం, ఆశ్రయం కోసం ఇళ్లలోకి చొరబడుతున్న పాములు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా విశాఖపట్నం పెందుర్తి ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి ఐదు అడుగుల పొడవైన గోధుమ నాగు చొరబడింది. సెల్లార్‌లోని వాచ్‌మెన్ కుటుంబం ఉంటున్న గదిలోకి వెళ్లి హల్‌చల్ చేసింది. రెస్క్యూ చేసేందుకు ప్రయత్నించగా పడగ విప్పి బుసలు కొడుతూ ఎదురుతిరగడంతో అక్కడి వారంతా భయాందోళనకు గురయ్యారు.

పెందుర్తిలోని ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో వాచ్‌మెన్ తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.. ఓ గోధుమ నాగు నేరుగా వాచ్‌మెన్ గదిలోకి చొరబడింది. గదిలో ఏదో కదులుతున్నట్లు గుర్తించిన వాచ్‌మెన్.. పరిశీలించగా భారీ నాగుపాము కనిపించింది. ఒక్కసారిగా పామును చూసి భయపడిన ఆయన వెంటనే అపార్ట్‌మెంట్ అసోసియేషన్ సభ్యులకు సమాచారం అందించాడు.

దీంతో అసోసియేషన్ సభ్యులు స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్‌కు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న కిరణ్ కుమార్.. పాము ఉన్న గదిలోకి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గోధుమ నాగును పట్టుకునేందుకు ప్రయత్నించగా.. అది ఒక్కసారిగా పడగ విప్పి బుసలు కొడుతూ ఆయనపైకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ ఏమాత్రం భయపడకుండా అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన కిరణ్ కుమార్.. చివరకు పామును సురక్షితంగా బంధించారు. గోధుమ నాగు బంధించడంతో వాచ్‌మెన్ కుటుంబంతో పాటు అపార్ట్‌మెంట్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పామును సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టేందుకు తరలించారు.

వీడియో దిగువన చూడండి..

అత్యంత విషపూరితమైన పాము

గోధుమ నాగు విషపూరితమైన పాము. భారతదేశంలో విస్తృతంగా కనిపించే విషపూరిత పాము జాతుల్లో ఇది కూడా ఒకటి. భారతదేశంలో పాముకాటుకు సంబంధించిన తీవ్ర ఘటనల్లో ప్రధానంగా ప్రస్తావించే ‘బిగ్ ఫోర్’ పాములలో సాధారణంగా ఇండియన్ కోబ్రా (నాగుపాము), కామన్ క్రైట్, రస్సెల్స్ వైపర్, సా-స్కేల్డ్ వైపర్లను పేర్కొంటారు. అయితే ఈ ఘటనలో కనిపించిన గోధుమ నాగును ‘బిగ్ ఫోర్’లోని నాగుపాముతో గందరగోళం చేయకూడదు. గోధుమ నాగు వేరే పాము జాతికి చెందినది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *