“హర్మూజ్ జలసంధిలో ఒక చమురు నౌక నెమ్మదిస్తే.. మన ఊరి పెట్రోల్ బంకులో మీటర్ వేగం పెరిగే అవకాశం ఉంటుంది.” ప్రపంచ పటంలో అది ఒక చిన్న జలసంధి. కానీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అది ఒక మహా ధమని. అక్కడ ఒక క్షిపణి పేలినా.. ఒక చమురు ట్యాంకర్ నిలిచిపోయినా.. ఒక దేశం మరో దేశాన్ని హెచ్చరించినా.. ఆ ప్రభావం ముందు స్టాక్ మార్కెట్లో కనిపిస్తుంది. తర్వాత చమురు మార్కెట్లో కనిపిస్తుంది. చివరికి.. మన వంటింటి ఖర్చు పుస్తకంలో కనిపిస్తుంది. అదే హర్మూజ్ జలసంధి కథ.
ఈరోజు మార్కెట్ లెక్కలు.. రేపటి మన బడ్జెట్?
ప్రపంచ మార్కెట్లో ప్రతి కదలిక.. మన ఇంటి ఖర్చుపై ఒక కొత్త లెక్క రాస్తోంది. ఆగస్టు 2, 2026 నాటి పరిస్థితి.. బ్రెంట్ క్రూడ్ (Brent Crude): బ్యారెల్‌కు 87.93 అమెరికన్ డాలర్లు (ఇటీవలి రోజుల్లో 90 డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది.) MCX క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు సుమారు రూ.8,096. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.115.73.
భారత్ వినియోగించే ముడి చమురులో దిగుమతులు: 85 శాతానికి పైగా ప్రపంచ సముద్ర మార్గంలో రవాణా అయ్యే చమురులో హర్మూజ్ గుండా వెళ్లేది దాదాపు 20 శాతం. ఒక బ్యారెల్ ధర 88 డాలర్ల దగ్గర ఉంది. కానీ ఆ ప్రభావం చివరకు రూ.115 దాటిన పెట్రోల్ రూపంలో సామాన్యుడి బంక్‌కి చేరుతోంది.
హర్మూజ్ అంటే అసలు ఏమిటి?
ఇరాన్, ఒమన్ మధ్య ఉన్న సుమారు 33 కిలోమీటర్ల వెడల్పు గల సముద్ర మార్గం. చూడటానికి చిన్నదే. కానీ.. ప్రపంచ ఇంధన వ్యవస్థకు ఇది ‘గొంతునాళం’. లెక్కల్లో చూస్తే.. ప్రపంచంలో సముద్ర మార్గంలో రవాణా అయ్యే చమురులో దాదాపు 20 శాతం ఈ మార్గం గుండా వెళ్తుంది. రోజుకు సుమారు 20 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు, ఇంధన ఉత్పత్తులు ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకు చేరుతాయి. ప్రపంచ LNG (ద్రవీకృత సహజవాయువు) సరఫరాలో కూడా గణనీయమైన భాగం ఇదే మార్గం గుండా వెళ్తుంది. అంటే.. హర్మూజ్‌లో రాకపోకలు ఆగితే ప్రపంచ చమురు మార్కెట్ గుండె చప్పుడు మందగిస్తుంది.
భారత్‌కు ఎందుకు గుబులు?
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతి దేశాల్లో ఒకటి. మనం వినియోగించే ముడి చమురులో 85 శాతానికి పైగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటాం. సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ, కువైట్, ఖతర్ దేశాల నుంచి వచ్చే చమురులో పెద్ద భాగం హర్మూజ్ జలసంధి గుండా వస్తుంది. అంటే.. హర్మూజ్‌లో ఉద్రిక్తత అంటే.. అది విదేశాంగ వార్త మాత్రమే కాదు… భారత కుటుంబ బడ్జెట్ వార్త కూడా అవుతోంది. పెట్రోల్ మాత్రమే కాదు… మీ ఇంట్లో ఇవన్నీ మండుతాయి. చాలామంది అనుకునేది పెట్రోల్ రేటు పెరిగితే బైక్‌కు మాత్రమే ఖర్చు పెరుగుతుందని. కానీ, అది మొదటి అడుగు మాత్రమే.
- రైతు దగ్గర.. డీజిల్ ఖరీదు ట్రాక్టర్ అద్దె పెరుగుతుంది. మోటార్ నడపడం ఖరీదవుతుంది. సాగు వ్యయం పెరుగుతుంది.
- రోడ్డు మీద.. లారీ డీజిల్ ఖరీదు, రవాణా ఛార్జీలు పెరుగుతాయి.
- మార్కెట్లో.. కూరగాయలు, పండ్లు, బియ్యం, పప్పులు…అన్నీ తీసుకొచ్చే ఖర్చు పెరుగుతుంది. చివరికి కూరగాయ రేటు పెరిగిందని అనుకుంటాం… అసలు పెరిగింది రవాణా ఖర్చు అనేది వాస్తవం.
- ఇంట్లో.. గ్యాస్ సిలిండర్, పాలు, స్కూల్ బస్సు, ఆటో ఛార్జీలు, ఆన్లైన్ డెలివరీ అన్నింటిపైనా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది.
రూ.2 పెరిగితే.. జేబుకు ఎంత భారం?
పెట్రోల్ ధరలో లీటరుకు రూ. 2 పెరిగిందంటే పెద్ద విషయం కాదనిపిస్తుంది. కానీ, నెలాఖరులో లెక్కలు వేసుకుంటే అదే రూ.2 ఒక కుటుంబానికి గట్టిగానే తగులుతుంది.
ఒక సాధారణ కుటుంబాన్ని ఉదాహరణగా తీసుకుంటే..
నెలకు 20 లీటర్ల పెట్రోల్ వాడితే.. లీటరుకు రూ.2 పెరిగితే.. రూ.40 అదనపు భారం. ఇది మాత్రమే కాదు LPG సిలిండర్‌పై అదనపు ఒత్తిడి, ఆటో ఛార్జీలు, స్కూల్ బస్సు ఫీజు, కూరగాయలు, పాలు, నిత్యావసరాల రవాణా ఖర్చు, కూరియర్, డెలివరీ ఛార్జీలు…ఇలా ఒకదాని వెంట ఒకటి పెరిగే అవకాశం ఉంటుంది. చివరికి…పెట్రోల్‌లో కనిపించేది రూ.2 మాత్రమే. కానీ నెలాఖరులో కుటుంబ బడ్జెట్లో రూ. 300 నుంచి రూ. 1,000 వరకు పరోక్ష భారం పడే అవకాశం ఉంది. ఇది కుటుంబ వినియోగం, స్థానిక రవాణా వ్యయం, ధరల మార్పులపై ఆధారపడి ఉంటుంది.
రైతు జేబులోనే మొదటి దెబ్బ
రైతు పొలంలో కనిపించేది మట్టి. కానీ…ఆ మట్టిని కదిలించేది డీజిల్. ట్రాక్టర్, హార్వెస్టర్, బోరు, మోటార్, ఎరువుల రవాణా, పురుగుమందుల సరఫరా ఇలా ప్రతి దాంట్లో ఇంధనం దాగి ఉంటుంది. అందుకే చమురు ధర పెరిగితే ముందుగా రైతు ఖర్చు పెరుగుతుంది. తర్వాత ఆ ఖర్చు మన కూరగాయల బిల్లులో కనిపిస్తుంది.
ఎరువు ధరకు హర్మూజ్‌తో సంబంధం ఏంటి?
చాలామందికి తెలియని విషయం ఏంటంటే యూరియా వంటి ఎరువుల తయారీలో సహజవాయువు కీలకం. ప్రపంచ గ్యాస్ ధరలు పెరిగితే ఎరువుల తయారీ ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే హర్మూజ్ ప్రభావం పెట్రోల్ బంక్ దగ్గర ఆగదు. పొలం వరకు వస్తుంది.
ఒక బ్యారెల్ ధర 10 డాలర్లు పెరిగితే ఏం జరుగుతుంది?
దేశ దిగుమతి బిల్లు పెరుగుతుంది. రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. రవాణా ఖర్చు పెరుగుతుంది. ద్రవ్యోల్బణంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయితే…ప్రపంచ చమురు ధర పెరిగినంత మేరకు పెట్రోల్ ధర వెంటనే పెరుగుతుందని చెప్పలేం. ప్రభుత్వ విధానాలు, పన్నులు, చమురు మార్కెటింగ్ కంపెనీల ధరల నిర్ణయాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అసలు భయం యుద్ధం కాదు.. అనిశ్చితి. చమురు మార్కెట్‌ను ఎక్కువగా కదిలించేది యుద్ధం కాదు. “రేపు ఏమవుతుందో?” అన్న భయం. ఒక ప్రకటన.. ఒక దాడి.. ఒక హెచ్చరిక చాలు. ప్రపంచ మార్కెట్ వెంటనే స్పందిస్తుంది. గ్రామీణ భాషలో ప్పాలంటే మన ఊరిలో చెరువు కట్ట పగిలితే…నీళ్లు మన పొలం వరకు వస్తాయి. అలాగే హర్మూజ్‌లో చమురు ప్రవాహానికి ఆటంకం వస్తే దాని అలలు మన ఇంటి వంటగది వరకు చేరే అవకాశం ఉంటుంది. “యుద్ధం సరిహద్దుల్లో మొదలవుతుంది… కానీ దాని అసలు ఖర్చు సామాన్యుడి వంటింట్లో లెక్కపడుతుంది.”
ముగింపు
ఒకప్పుడు మనకు పెట్రోల్ రేటు మాత్రమే తెలుసు. ఇప్పుడు ప్రపంచ మ్యాప్ కూడా తెలుసుకోవాల్సిన రోజులు వచ్చాయి. ఎందుకంటే…హర్మూజ్‌లో అలజడి మొదలైతే… దాని అలలు మన ఇంటి బడ్జెట్‌ను కూడా తాకే అవకాశం ఉంది. హర్మూజ్ మన దేశంలో లేదు. కానీ, హర్మూజ్‌లో జరిగే ప్రతి పరిణామం, భారత కుటుంబం నెలాఖరు లెక్కల్లో ఒక కొత్త గీత గీసే శక్తి కలిగి ఉంది. “చమురు సముద్రంలో ప్రయాణిస్తుంది… కానీ దాని అసలు ధర చివరికి సామాన్యుడి జేబులోనే లంగరు వేస్తుందని గుర్తుంచుకోవాలి.
– కొండవీటి శివనాగరాజు
టీవీ9 డిప్యూటీ అవుట్‌పుట్ ఎడిటర్