
గాల్లోకి విసిరిన కొబ్బరికాయను తలతో పగలగొట్టడం, 20, 40, 60 కేజీల బరువున్న రాళ్లను గాల్లోకి ఎగరవేసి, వీపుతో పట్టుకోవడం అంత తేలికైన విషయమేం కాదు.. తేడా వస్తే వెన్నుపూస, భుజం గూడు జారడం ఖాయం. కానీ మాదిగ మాస్టీన్లుగా పిలువబడే వీరు మాత్రం ఎలాంటి భయం బెరుకు లేకుండా తమ శరీర దారుఢ్యంతో ఈ అద్భుత కళను ప్రదర్శిస్తున్నారు. గతంలో విజయనగరం రాజుల పాలనలో యుద్ధవీరులుగా సేవలు అందించి ఈ వీరు.. నాడు గొప్ప గౌరవ మర్యాదలు పొందారు. తదనంతరం రాజ్యాలు అంతరించడంతో, తమ బలాన్ని ప్రదర్శించే ఈ విద్యా ప్రదర్శనలనే జీవనాధారంగా మార్చుకున్నారు. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లో వేళ్లపై లెక్కించదగిన సంఖ్యలోనే ఈ కళాకారులు మిగిలి ఉన్నారు.
ఒకప్పుడు సంచార జీవులుగా ఊరూరా తిరుగుతూ తమ కళలను ప్రదర్శించి, ప్రజల ఆదరణతో పొట్ట పోషించుకునేవారు. కానీ ప్రస్తుతం ఒకే గ్రామంలో స్థిరపడి జీవిస్తున్నా.. జీవితాలు మాత్రం తీవ్ర కష్టాల్లోనే గడుస్తున్నాయని ఈ కళాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విన్యాసాలు చేస్తున్నా, తమకు కనీసం కళాకారులుగా కూడా గుర్తింపు లభించడం లేదని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తమకు కనీసం కుల ధ్రువీకరణ పత్రాలు కూడా మంజూరు కావడం లేదని వాపోతున్నారు.
అయితే మాస్టిన్ కళాకారుల విన్యాసాలను చూసి ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తీవ్రంగా చలించిపోయారు. ప్రభుత్వాలు వీరిని తప్పకుండా ఆదుకోవాల్సిన అవసరం ఉందని.. ఈ ప్రాచీన కళను, కళాకారుల దయనీయ స్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల దృష్టికి తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.