కుటుంబ కలహాలు రెండు రాష్ట్రాల్లో ఘోర విషాదాలకు దారితీశాయి. హర్యానాలో భార్యతో వివాదాల నేపథ్యంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందగా.. కర్ణాటకలో ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి భార్య, ఇద్దరు చిన్నారులను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
హర్యానాలోని గురుగ్రామ్‌లో 36 ఏళ్ల సంజీవ్ యాదవ్ అనే వ్యక్తి తన నివాసంలో ఉరివేసుకుని మృతి చెందాడు. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలో అసోసియేట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సంజీవ్.. భార్య మన్‌ప్రీత్ కౌర్‌తో కొంతకాలంగా వైవాహిక విభేదాలు ఎదుర్కొంటున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, విడాకులు కోరుతూ భార్యతో వివాదాలు కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇంట్లో సంజీవ్ భార్య, ఏడేళ్ల కుమారుడు మాత్రమే ఉన్నారు. తన తండ్రి ఉరివేసుకుని ఉండటాన్ని చూసిన చిన్నారి మొబైల్ ఫోన్లో వీడియో రికార్డ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మన్‌ప్రీత్ కౌర్‌ను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
మృతుడి సోదరి కిరణ్, తండ్రి రామ్‌సేవక్ యాదవ్ మాత్రం ఇది సాధారణ ఆత్మహత్య కాదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంజీవ్ మరణానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల అసలు కారణం వెల్లడవుతుందని పోలీసులు తెలిపారు.
భార్యాపిల్లలను చంపి, భర్త ఆత్మహత్య..!
ఇదే సమయంలో కర్ణాటకలోని మైసూరు జిల్లాలో మరో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. హున్సూర్ పట్టణానికి చెందిన హరీష్ అనే వ్యక్తి తన భార్య నిశ్చయ, ఇద్దరు చిన్నారులు రక్ష, నక్షలను హత్య చేసి అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హున్సూర్ పట్టణంలోని న్యూ మారుతి లేఅవుట్లో ఈ సంఘటన జరిగింది. పోలీసుల ప్రాథమిక విచారణలో హరీష్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడైంది. బీమా కంపెనీ వాహన రికవరీ విభాగంలో పనిచేస్తున్న అతడు తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు భావిస్తున్నారు. ఘటనకు ముందు ఆత్మహత్య లేఖ కూడా రాసి ఉంచినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ రెండు ఘటనలు కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిడి, ఆర్థిక సమస్యలు ఎంతటి విషాదాలకు దారితీస్తాయో మరోసారి గుర్తుచేశాయి. అయితే గురుగ్రామ్ ఘటనలో మరణానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుండగా, మైసూరు ఘటనలో కూడా అన్ని కోణాల్లో విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదికలు, ఫోరెన్సిక్ ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లి్క్ చేయండి..