IND vs SL : భారత క్రికెట్ జట్టు త్వరలో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల సుదీర్ఘ టెస్టు సిరీస్ జరగనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పట్టిక దృష్ట్యా టీమిండియాకు ఈ సిరీస్ అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ కొత్తగా రూపొందిన తన యువ జట్టుతో శ్రీలంకలోని స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌లపై ఎలా రాణిస్తారనేది ఒక పెద్ద సవాలుగా మారింది. ఈ ఉత్కంఠభరిత సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. భారత్, శ్రీలంక టెస్టు సిరీస్ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ బ్యాటర్లు ఎవరో తెలుసుకుందాం.
అగ్రస్థానంలో గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్
భారత్-శ్రీలంక టెస్టు సిరీస్ చరిత్రలోనే అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించాడు. 1990 నుంచి 2010 మధ్యకాలంలో శ్రీలంకపై టెస్టులు ఆడిన సచిన్, మొత్తం 25 మ్యాచ్‌ల్లోని 36 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి 1995 రన్స్ సాధించాడు. ఈ సమయంలో సచిన్ 60.45 సగటుతో పరుగుల వరద పారించాడు. ఇందులో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 203 పరుగులు. శ్రీలంకపై సచిన్ ఏకంగా 9 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు బాది, ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.
రెండో స్థానంలో లంక దిగ్గజం మహేళ జయవర్ధనె
ఈ జాబితాలో రెండో స్థానంలో శ్రీలంక మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాటర్ మహేళ జయవర్ధనె నిలిచాడు. భారత్‌పై జయవర్ధనె 18 టెస్టు మ్యాచ్‌ల్లోని 28 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి 67.48 సగటుతో 1822 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
మూడో స్థానంలో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ
భారత క్రికెట్ రన్ మెషిన్, కింగ్ విరాట్ కోహ్లీ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. శ్రీలంకపై కోహ్లీ 11 టెస్టు మ్యాచ్‌లలోని 18 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి 67.81 సగటుతో 1085 పరుగులు సాధించాడు. ఇందులో 243 పరుగులు అతని అత్యధిక స్కోరు కాగా, మొత్తం 5 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
నాలుగు, ఐదు స్థానాల్లో వీరేందర్ సెహ్వాగ్, అజహరుద్దీన్
కోహ్లీ తర్వాత భారత డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ 11 మ్యాచ్‌లలోని 18 ఇన్నింగ్స్‌లలో 5 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఐదో స్థానంలో భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ 5 సెంచరీలతో ఉన్నాడు. వీరితో పాటు శ్రీలంక దిగ్గజాలు కుమార్ సంగక్కర, అరవింద డి సిల్వా కూడా భారత్‌పై చెరో 5 సెంచరీలు నమోదు చేయడం విశేషం.
భారత్ vs శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సెంచరీల రికార్డు
సచిన్ టెండూల్కర్ – 9 సెంచరీలు
మహేళ జయవర్ధనె – 6 సెంచరీలు
విరాట్ కోహ్లీ – 5 సెంచరీలు
వీరేందర్ సెహ్వాగ్ – 5 సెంచరీలు
మహమ్మద్ అజహరుద్దీన్ – 5 సెంచరీలు
కుమార్ సంగక్కర – 5 సెంచరీలు
అరవింద డి సిల్వా – 5 సెంచరీలు
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.