సండే వచ్చినా లేదా ఇంట్లో ఏమైనా ప్రత్యేక సందర్భం లాంటివి ఉన్నా చికెన్, మటన్ ఉండాల్సిందే.. ముఖ్యంగా నాన్-వెజ్ ప్రియులు మటన్ ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సాధారణంగా చేసే మటన్ గ్రేవీ, మటన్ సుక్కా కాకుండా కాస్త వైవిధ్యంగా, ఘుమఘుమలాడే మసాలాలతో ఆంధ్రా స్టైల్ లో మటన్ ఆయిల్ ఫ్రై తయారు చేసుకోవడం చాలా సులభం.. అయితే.. దీనికోసం కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది.. వంట రాని వారి కూడా ఈ ఈజీగా మటన్ ఫ్రై ని సులభంగా తయారు చేసుకోవచ్చు.. వంకాయలు లేదా పప్పుచారుతో కాంబినేషన్‌గా, లేదా వేడివేడి అన్నంలోకి సైడ్ డిష్‌గా ఈ ఫ్రై అద్భుతమైన రుచిని ఇస్తుంది.
మటన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు..
- మటన్
- నూనె – సరిపడా
- ఉల్లిపాయలు (సన్నగా తరిగినవి)
- అల్లం వెల్లుల్లి పేస్ట్
- పసుపు పొడి
- కారం పొడి
- ధనియాల పొడి
- గరం మసాలా లేదా మటన్ మసాలా
- దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు – సరిపడా
- కరివేపాకు, కొత్తిమీర – గుప్పెడు
- ఉప్పు – రుచికి సరిపడా
తయారీ విధానం:
మటన్ ఉడికించడం: ముందుగా మటన్‌ను శుభ్రంగా కడిగి కుక్కర్లో వేయాలి. అందులో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి 4 నుండి 5 విజిళ్లు వచ్చే వరకు మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ముదురు మటన్ అయితే.. ఇంకో రెండు మూడు విజిల్స్ వచ్చేలా చూడండి..
తాళింపు: బాణలిలో (పాన్) కాస్త ఎక్కువ నూనె వేసి వేడెక్కిన తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి.
ఉల్లిపాయలు, మసాలా: ఆ తర్వాత సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసి దోరగా (బంగారు రంగులోకి వచ్చేవరకు) వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
కారాలు – మటన్ చేర్చడం: ఇప్పుడు కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి నూనెలో బాగా కలపాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలను (రసంతో సహా) బాణలిలో వేసి బాగా కలపాలి.
ఫ్రై చేయడం: మటన్‌లోని నీరంతా ఇంకిపోయి, మసాలాలు ముక్కలకు బాగా పట్టి, నూనె పైకి తేలే వరకు సన్నని మంటపై బాగా ఫ్రై చేయాలి.
ఫినిషింగ్: చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని దింపేస్తే ఘుమఘుమలాడే స్పైసీ ‘మటన్ ఆయిల్ ఫ్రై’ రెడీ అవుతుంది..
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ స్టైల్ లో మటన్ వండుకుని ఆస్వాదించండి..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..