ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరినది వరద ఉదృతి క్రమంగా పెరుగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం 7 గంటల నాటికి భద్రాచలం వద్ద నీటి మట్టం 49.8 అడుగులు, కూనవరం వద్ద నీటిమట్టం 16.35 మీటర్లు, పోలవరం వద్ద 10.26 మీటర్లు, ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5,39,934 క్యూసెక్కులు ఉందని తెలిపారు. శుక్రవారం రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక, శనివారం రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద ప్రవాహం చేరే అవకాశం ఉందన్నారు. ప్రభావిత తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, పోలవరం జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. అత్యవసర సేవలకు అమలాపురం, రాజమహేంద్రవరం,చింతూరు, విఆర్ పురం, జంగారెడ్డిగూడెంలో మొత్తంగా 3 NDRF, 3 SDRF బృందాలు సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. రేపు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత, లంక గ్రామాల ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు,పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు.
ఏపిఎస్డీఎంఏ నుండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ప్రఖర్ జైన్ వెల్లడించారు. అత్యవసర సహాయం,సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 425 0101 లను సంప్రదించాలని కోరారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, కలవర్టులు, కాజ్‌వేల వద్ద ప్రమాదకర ప్రయాణాలను చెయ్యొద్దన్నారు.నదిలో స్నానికి, ఈతకు వెళ్లడం, చేపల వేటకు వెళ్లడం లాంటివి చేయరాదని సూచించారు. మరోవైపు శనివారం మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
రాష్ట్రంలో విపత్తు నిర్వహణ వ్యవస్థల బలోపేతంపై కేంద్ర ఉన్నతాధికారుల బృందం సమీక్ష నిర్వహించింది. రాష్ట్రంలో భవిష్యత్తులో ఎదురయ్యే ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితులను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు.సమీక్షా సమావేశంలో ప్రధానంగా వడగాలులు, పిడుగుపాటు వంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికల అమలు తీరును పరిశీలించారు. అలాగే రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బెటాలియన్ల సామర్థ్యాన్ని పెంపొందించడం, ఆధునిక పరికరాల సమీకరణ, అగ్నిమాపక సేవల విస్తరణకు సంబంధించిన అంశాలపై కేంద్ర బృందానికి వివరించారు. అదేవిధంగా రాష్ట్ర, జిల్లా స్థాయి విపత్తు నిర్వహణ ప్రణాళికల నవీకరణ పురోగతి, ఎన్‌డిఎమ్‌ఐఎస్ (NDMIS) పోర్టల్‌లో నష్టపరిహార వివరాలు, నిధుల నిర్వహణ సమాచారాన్ని సకాలంలో నమోదు చేయడం వంటి అంశాలపై సమీక్షించారు. అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్లు ఇండియా డిజాస్టర్ రిసోర్స్ నెట్‌వర్క్ (IDRN) పోర్టల్‌ను సమర్థవంతంగా వినియోగించే విధంగా చేపట్టాల్సిన చర్యలపై కూడా సమావేశంలో చర్చించి, పలు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా కార్యాచరణను రూపొందించినట్లు మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. రాష్ట్రంలో విపత్తు నిర్వహణ వ్యవస్థలను జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.