స్టార్ హీరోయిన్, తెలుగింటి కోడలు రష్మిక మందన్న తీవ్ర గాయానికి గురైనట్లు సమాచారం. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె, ‘రణబాలి’, ‘మైసా’ చిత్రాల షూటింగ్‌ల్లో పాల్గొంటున్నారు. ఈ చిత్రాల్లోని యాక్షన్ సన్నివేశాలు, డ్యాన్స్ సీక్వెన్సుల కోసం నిరంతరం శ్రమించడంతో ఆమెకు హిప్ ప్రాంతంలో తీవ్రమైన గాయం అయినట్లు తెలుస్తోంది.
వైద్యుల సమాచారం ప్రకారం, రష్మిక హిప్ ఏరియాలోని టెండన్ పూర్తిగా డిటాచ్మెంట్ కావడంతో పరిస్థితి తీవ్రంగా ఉందని వెల్లడించారు. సాధారణంగా ఇలాంటి గాయాలు తీవ్ర స్థాయిలో శారీరక శ్రమ చేసే ప్రొఫెషనల్ క్రీడాకారుల్లోనే ఎక్కువగా కనిపిస్తాయని వైద్యులు పేర్కొన్నట్లు సమాచారం. గాయం తీవ్రతను పరిశీలించిన అనంతరం రష్మికకు ఆరు వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ఆమె చిత్రాల షూటింగ్ షెడ్యూల్లలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రష్మిక ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, ఈ గాయం కారణంగా కొంతకాలం షూటింగ్‌లకు దూరంగా ఉండాల్సి రావడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే సరైన చికిత్స, విశ్రాంతి తర్వాత ఆమె త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్‌ల్లో పాల్గొంటారని మూవీ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.