సాధారణంగా చాలామందికి పాలల్లో బెల్లం వేయగానే పాలు విరిగిపోయే సమస్య ఎదురవుతుంటుంది. కానీ కొన్ని చిన్న జాగ్రత్తలు పాటిస్తే పాలు విరిగిపోకుండా కమ్మటి పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ అటుకుల పాయసం తయారీ కోసం ముందుగా ఒక గిన్నెలో అర కప్పు బెల్లం తురుము, పావు కప్పు నీళ్లు పోసి బెల్లం కరిగే వరకు మరిగించాలి.
పాకం రానవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగి ఒకటిరెండు నిమిషాలు మరిగితే సరిపోతుంది. ఆ తర్వాత వేరొక గిన్నెలో అర లీటరు చిక్కటి పాలు పోసి మరిగించుకోవాలి. కాస్త క్రీమీగా, రిచ్ టేస్ట్ రావాలంటే ఫుల్ క్రీమ్ మిల్క్ వాడటం మంచిది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడెక్కాక జీడిపప్పు, బాదం, కిస్మిస్లను దోరగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
అదే నేతిలో ఒక కప్పు లావు అటుకులు వేసి కలుపుతూ రెండు మూడు నిమిషాలు వేయించాలి. అటుకులు క్రిస్పీగా అయిన తర్వాత, పక్కన వేడి చేసిన అర లీటరు పాలను అందులో పోసి బాగా కలపాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 3 నుండి 4 నిమిషాలు ఉడికించాలి.
అటుకులు చాలా త్వరగానే మెత్తగా ఉడికిపోతాయి. అటుకులు ఉడికిన తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్, అర టీస్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన ఒకటిరెండు నిమిషాల తర్వాత, ముందుగా సిద్ధం చేసుకున్న బెల్లం పాకాన్ని వడగట్టి పాయసంలో పోసి బాగా కలుపుకోవాలి.
స్టవ్ ఆఫ్‌లో ఉన్నప్పుడు బెల్లం సిరప్ కలపడం వల్ల పాలు ఎంతమాత్రం విరిగిపోవు. మూతపెట్టి రెండు నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత వేడి వేడిగా లేదా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే కమ్మటి అటుకుల పాయసం సిద్ధమవుతుంది.




