మరో రెండు రోజుల్లో ఆగస్ట్ నెల రాబోతుంది. కొత్త నెల వస్తుందంటేనే ప్రజలను ఆర్ధికంగా ప్రభావితం చేసే అనేక మార్పులు అమల్లోకి వస్తూ ఉంటాయి. అందులో భాగంగా నెల మారుతుందంటేనే.. బ్యాంకు సెలవుల గురించి తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. బ్యాంకులతో ప్రతీఒక్కరికీ పని ఉంటుంది. దీంతో సెలవుల గురించి ముందే తెలుసుకుంటే సమస్యలు ఎదురుకావు. ఆగస్ట్ నెల వస్తుండటంతో బ్యాంక్ సెలవులు ఎలా ఉన్నాయి..? ఏయే రోజుల్లో మూతపడతాయి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆగస్టులో మొత్తం 9 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఆగస్ట్ 4న త్రిపురలో కేర్ పూజ సందర్భంగా ఆ రాష్ట్రంలో బ్యాంకులు పనిచేయవు. ఇక టెండోంగ్ లో రమ్ ఫాట్ సందర్భంగా ఆగస్టు 8న సిక్కింలో బ్యాంకులు బంద్ అవుతాయి. దేశభక్తుల దినోత్సవం సందర్భంగా ఆగస్టు 13న మణిపూర్లో బ్యాంకులు మూసివేసి ఉంటాయి. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
మహారాజా బీర్ విక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ జయంతి సందర్భంగా ఆగస్టు 19న త్రిపురలో బ్యాంకులు క్లోజ్ చేసి ఉంటాయి. మిలాద్-ఉన్-నబీ, మొదటి ఓనం, మిలాద్-ఎ-షరీఫ్ జన్మదినం సందర్భంగా కేరళ, ఏపీలో ఆగస్టు 25న బ్యాంకులు పనిచేయవు. దీంతో ఏపీ ప్రజలు ఈ విషయాన్ని గమనించి బ్యాంక్ బ్రాంచ్ కార్యకలాపాలు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరముంది.
ఆగస్ట్ 28న గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, జమ్మూ, శ్రీనగర్, కేరళ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లలో రక్షా బంధన్, పాంగ్-లబ్సోల్, శుక్రవారం ఈద్-ఇ-మిలాద్-ఉన్-నబీ, శ్రీనారాయణ గురు జయంతి సందర్భంగా బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మేరకు ఆగస్ట్ సెలవులకు సంబంధించిన క్యాలెండర్ను ఆర్బీఐ విడుదల చేసింది.
ఇక వీటితో పాటు ఆగస్ట్ 2 ఆదివారం, ఆగస్ట్ 8 రెండో శనివారం, ఆగస్ట్ 9 ఆదివారం, ఆగస్ట్ 16 ఆదివారం, ఆగస్ట్ 22 నాలుగో శనివారం, ఆగస్ట్ 23 ఆదివారం, ఆగస్ట్ 30 ఆదివారం సందర్భంగా బ్యాంకులకు సాధారణ సెలవులు రానున్నాయి.




