దేశంలోనే తొలిసారిగా సంప్రదాయ వ్యవసాయ పరిజ్ఞానానికి విశ్వవిద్యాలయ స్థాయిలో గుర్తింపు కల్పిస్తూ 138 మంది రైతులకు ‘కృషి ఋషి’ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. శ్రీ సత్యసాయి యూనివర్శిటీ ఫర్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ (SSSUHE) 5వ స్నాతకోత్సవంలో ఈ వినూత్న ప్రయత్నం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇదే కార్యక్రమంలో 119 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయగా.. 24 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు. బుధవారం సత్యసాయి గ్రామంలోని ప్రేమామృతం ఆడిటోరియంలో జరిగిన స్నాతకోత్సవానికి విశ్వవిద్యాలయ వ్యవస్థాపక కులపతి సద్గురు మధుసూదన్ సాయి అధ్యక్షత వహించారు. మైసూరు–కొడుగు లోక్‌సభ సభ్యుడు, మైసూరు రాజవంశీయుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ ముఖ్య అతిథిగా హాజరై పట్టాలు, బంగారు పతకాలు, గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు. చిక్కమగళూరు, త్రిప్టూరు (తుమకూరు జిల్లా), అరసీకెరె (హాసన్ జిల్లా) ప్రాంతాలకు చెందిన 138 మంది రైతులకు ‘కృషి – ఋషి’ సర్టిఫికెట్లు అందజేసి వారి సంప్రదాయ వ్యవసాయ జ్ఞానం, అనుభవానికి విశ్వవిద్యాలయం గుర్తింపు ఇచ్చింది.

Sri Sathya Sai University for Human Excellence
పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత డా. ఆర్.ఎ. మషేల్కర్, భారత మాజీ క్రికెటర్ గుండప్ప విశ్వనాథ్, తబలా విద్వాంసుడు పండిట్ సురేష్ తల్వాల్కర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సలహాదారు డా. జి.వి. సింగ్, భారతరత్న ప్రొఫెసర్ సి.ఎన్.ఆర్. రావు, డా. సౌమ్య స్వామినాథన్, డా. ఇందుమతి రావులకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు. సద్గురు మధుసూదన్ సాయి మాట్లాడుతూ.. సంప్రదాయ వ్యవసాయ విజ్ఞానానికి ఇప్పటివరకు విద్యావ్యవస్థలో తగిన గుర్తింపు లభించలేదన్నారు. “దేశంలోనే తొలిసారిగా రైతుల జ్ఞానం, అనుభవానికి విశ్వవిద్యాలయం ద్వారా గుర్తింపు ఇస్తున్నాం. ఈ ఏడాది 138 మంది రైతులకు సర్టిఫికెట్లు అందించాం. వచ్చే స్నాతకోత్సవానికి కనీసం 2 వేల మంది రైతులకు ఈ గుర్తింపు ఇవ్వాలన్నది మా లక్ష్యం” అని తెలిపారు. అన్నపూర్ణ ఉదయపు అల్పాహార పథకం ద్వారా 25 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 1.5 లక్షలకు పైగా ప్రభుత్వ పాఠశాలల ద్వారా రోజూ కోటి మంది చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నామని, ఈ కార్యక్రమానికి పలు జిల్లాల రైతులు సహజ వ్యవసాయ ఉత్పత్తులతో తోడ్పడుతున్నారని చెప్పారు.
Sri Sathya Sai University for Human Excellence
ముఖ్య అతిథి యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ మాట్లాడుతూ.. డిజిటల్ టెక్నాలజీ, అంతరిక్షం, కృత్రిమ మేధ, వైద్యం, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో భారత్ వేగంగా ముందుకు సాగుతోందన్నారు. “వికసిత భారత్ నిర్మాణంలో విలువల ఆధారిత విద్యాసంస్థల పాత్ర ఎంతో కీలకం. సత్యసాయి గ్రామం, విశ్వవిద్యాలయం మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను” అని అన్నారు. 2019లో ప్రారంభమైన శ్రీ సత్యసాయి యూనివర్శిటీ ఫర్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్… విద్య, వసతి, భోజనం సహా అన్ని సౌకర్యాలను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. ఈ ఏడాది పట్టాలు పొందిన 119 మందిలో 60 శాతం మంది విద్యార్థినులు, 85 శాతం మంది బీపీఎల్ కుటుంబాలకు చెందినవారు.. 67 శాతం మంది తొలి తరం గ్రాడ్యుయేట్లు, 51 శాతం మంది గ్రామీణ నేపథ్యానికి చెందినవారు ఉన్నారు.