Vaibhav Sooryavanshi ICC T20 Rankings: జింబాబ్వే గడ్డపై భారత యువ జట్టు అదరగొట్టింది. హరారే వేదికగా జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్ విజయంలో ముఖ్య భూమిక పోషించింది 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన తొలి సిరీస్‌లోనే తన బ్యాట్‌తో పరుగుల సునామీ సృష్టించాడు. కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే 50.33 సగటుతో 151 పరుగులు రాబట్టి ఏకంగా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ అద్భుతమైన ప్రదర్శన అతనికి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారీ ప్రమోషన్ తెచ్చిపెట్టింది. రాత్రికి రాత్రే ఏకంగా 230 స్థానాలను అధిగమించి, తన కెరీర్లోనే అత్యుత్తమంగా 48వ ర్యాంకుకు చేరుకున్నాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 536 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. చిన్న వయసులోనే ఇంతటి అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్ భవిష్యత్తులో టీమిండియాకు పటిష్టమైన పునాదిగా మారతాడని క్రీడా విశ్లేషకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
నంబర్ వన్ స్థానంలో ఇషాన్.. విరాట్ రికార్డు బద్దలు
ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అగ్ర పీఠాన్ని సగర్వంగా అధిరోహించాడు. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో 81 పరుగులతో చెలరేగిన కిషన్.. తన కెరీర్లోనే అత్యధికంగా 916 రేటింగ్ పాయింట్లను తాకాడు. సిరీస్ ముగిసే సమయానికి 910 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఒక బ్యాటర్ సాధించిన మూడో అత్యుత్తమ రేటింగ్ ఇదే కావడం విశేషం. పాకిస్థాన్ ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్ 848 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఫర్హాన్ కంటే ఇషాన్ కిషన్ చాలా ముందంజలో ఉన్నాడు.
ఇది కూడా చదవండి: ఐపీఎల్ ఆడకముందే టీమిండియాలోకి పిలుపు.. కట్ చేస్తే.. బెంచ్‌కే పరిమితమైన ఐదుగురు అన్ లక్కీ ప్లేయర్లు..!
ఇవి కూడా చదవండి
ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ సాధించిన అత్యుత్తమ రేటింగ్ పాయింట్ల రికార్డును ఇషాన్ కిషన్ చెరిపేశాడు. గతంలో సూర్యకుమార్ యాదవ్ 912 పాయింట్లు సాధించగా, విరాట్ కోహ్లీ 909 పాయింట్లతో నిలిచాడు. ఓవరాల్‌గా చూస్తే 931 పాయింట్లతో అభిషేక్ శర్మ తొలి స్థానంలో ఉండగా, ఇంగ్లాండ్ ఆటగాడు డేవిడ్ మలన్ 919 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి అత్యుత్తమ రికార్డు ఇషాన్ కిషన్ పేరిటే నమోదైంది.
దుమ్మురేపిన కుర్రాళ్లు.. బౌలింగ్‌లో బిష్ణోయ్ జంప్
బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ మన యువ ఆటగాళ్లు సత్తా చాటారు. జింబాబ్వే సిరీస్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టిన స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఐసీసీ టీ20 బౌలర్ల జాబితాలో ఏకంగా 31 స్థానాలు ఎగబాకి 41వ ర్యాంకుకు చేరుకున్నాడు. బ్యాటర్ల విభాగంలో తిలక్ వర్మ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ఆరో ర్యాంకులో నిలవగా, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఏడు స్థానాలు ఎగబాకి 24వ ర్యాంకును దక్కించుకున్నాడు. ప్రత్యర్థి జట్టు జింబాబ్వే ఆటగాళ్లలో ర్యాన్ బర్ల్ 85వ స్థానానికి చేరుకోగా, ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబాని బౌలర్ల జాబితాలో 26వ స్థానంలో నిలిచాడు.
వన్డేల్లో మళ్లీ శుభ్‌మన్ గిల్ రాజ్యంలోకి..
వన్డే ఫార్మాట్‌ను తీసుకుంటే భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తిరిగి నంబర్ వన్ కిరీటాన్ని కైవసం చేసుకున్నాడు. జనవరి నుంచి అగ్రస్థానంలో కొనసాగుతున్న న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్.. వెస్టిండీస్‌తో జరిగిన తాజా సిరీస్‌కు దూరం కావడంతో ఆ స్థానం నేరుగా గిల్ వశమైంది. అటు టెస్టుల్లో పాకిస్థాన్‌పై అద్భుత ప్రదర్శన చేసిన వెస్టిండీస్ ఆల్ రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ బౌలర్ల జాబితాలో 48వ ర్యాంకుకు, ఆల్ రౌండర్ల జాబితాలో 9వ స్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్‌కే చెందిన బౌలర్ జేడెన్ సీల్స్ 24వ ర్యాంకుకు చేరుకోగా, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం తన 32వ టెస్ట్ హాఫ్ సెంచరీతో బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో 15వ స్థానానికి చేరుకున్నాడు.
ఇది కూడా చదవండి: ఆ నలుగురు చెత్త ఫీల్డర్లను పీకేయండి.. ఇంకెన్నాళ్లు దాచిపెడతారు..: బీసీసీఐపై గవాస్కర్ ఫైర్..!
సొంతగడ్డపైనే కాకుండా విదేశీ పిచ్‌లపై కూడా యువ భారత ఆటగాళ్లు కనబరుస్తున్న ఈ అద్భుత తెగువ భవిష్యత్తు క్రికెట్‌కు శుభసూచకం. సీనియర్ల గైర్హాజరీలో కూడా ఏమాత్రం భయం లేకుండా ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్న ఈ యువతరం.. రాబోయే ఐసీసీ మెగా టోర్నీల్లో భారత్‌కు తిరుగులేని విజయాలు అందించడం ఖాయంగా కనిపిస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..