Headlines

Video: నీట్ నిరసనల్లో పుట్టిన ప్రేమ.. లాఠీఛార్జ్‌తో ఒక్కటైన జంట.. సినిమాను మించిన రియల్ లవ్ స్టోరీ..

Video: నీట్ నిరసనల్లో పుట్టిన ప్రేమ.. లాఠీఛార్జ్‌తో ఒక్కటైన జంట.. సినిమాను మించిన రియల్ లవ్ స్టోరీ..


ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సాధారణంగా నిరసనలు, ధర్నాలు, పోలీసుల లాఠీచార్జీలే కనిపిస్తుంటాయి. కానీ అలాంటి ఒక ఉద్రిక్త వాతావరణంలో ఎవరూ ఊహించని ఒక అరుదైన ప్రేమకథ మొదలైంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన కార్యక్రమం.. ఇద్దరు యువతీయువకులను ఒక్కటి చేసింది. ఆందోళనలో మొదలైన వీరి పరిచయం చివరికి వివాహ బంధానికి దారితీయడం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఆకలి, దాహంతో మొదలైన పరిచయం

బీహార్‌కు చెందిన మోహన్ శ్రీవాస్తవ అనే యువకుడు గత పదిహేను రోజులుగా జంతర్ మంతర్ వద్ద ఉండి నిరసనల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఢిల్లీకి చెందిన ఒక యువతి అతనికి రోజూ ఆహారాన్ని తెచ్చి ఇచ్చేది. ఆ యువతి కూడా నీట్ పరీక్ష రాసిన అభ్యర్థి కావడం విశేషం. ‘‘ఆమె ప్రతిరోజూ నా కోసం ఏదో ఒక తినుబండారం తెచ్చేది. ఒకరోజు సరదాగా.. నాకు తిండి మాత్రమే ఇస్తావా, తాగడానికి నీళ్లు ఇవ్వవా? అని అడిగాను. దానికి ఆమె నవ్వి, మరుసటి రోజే నా కోసం ఒక పెద్ద వాటర్ బాటిల్ తీసుకొచ్చింది” అని మోహన్ ఆనాటి ముచ్చట్లను గుర్తుచేసుకున్నాడు. అలా ఆ నీళ్ల సీసాతో మొదలైన వారి సంభాషణలు మెల్లగా ప్రణయంగా మారాయి.

ఇవి కూడా చదవండి



లాఠీచార్జ్.. ఆసుపత్రి ఘటనతో మారిన మలుపు

వీరి పరిచయం ముదిరిన మరుసటి రోజే జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో మోహన్ తలకు బలమైన గాయమై స్పృహ తప్పిపడిపోయాడు. వెంటనే ఆ యువతి అతడిని ఆసుపత్రికి తరలించి, రాత్రంతా దగ్గరుండి సపర్యలు చేసింది. స్పృహ వచ్చిన తర్వాత, ప్రియుడి పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయిన ఆ యువతి.. ‘‘నువ్వు లేకుండా నేను బతకలేను’’ అని తన ప్రేమను వ్యక్తపరిచింది. మోహన్ కూడా తన ప్రేమను అంగీకరించడంతో, ఇద్దరూ ఆలస్యంచేయకుండా వెంటనే ఒక గుడికి వెళ్లి వివాహం చేసుకున్నారు.

వైరల్ వీడియో.. అమ్మ కోపమే పెద్ద సమస్య..

ఏ సినిమా కథకూ తీసిపోని వీరి పెళ్లి దృశ్యాలు, వివరాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే కథ సుఖాంతమైందనుకునే లోపే మరో ట్విస్ట్ ఎదురైంది. ఆకస్మికంగా జరిగిన ఈ పెళ్లిని మోహన్ తల్లి అంగీకరించడం లేదని, ఆమెను ఎలా ఒప్పించాలో అర్థం కావడం లేదని మోహన్ వాపోయాడు. ఏది ఏమైనా, డిమాండ్లు.. లాఠీచార్జీల మధ్య మొదలైన ఈ జంతర్ మంతర్ లవ్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *