IND vs SL : టీ20 క్రికెట్ హడావుడి ముగియడంతో భారత క్రికెట్ జట్టు ఇప్పుడు సుదీర్ఘ ఫార్మాట్ అయిన టెస్టు క్రికెట్‌పై దృష్టి సారించింది. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం టీమిండియా జట్టును మంగళవారం అధికారికంగా ప్రకటించనున్నారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్, ఫిట్నెస్, లంక పిచ్‌ల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఒక స్ట్రాంగ్ తుది జట్టును సిద్ధం చేయనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పట్టికలో భారత్ స్థానాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ సిరీస్ అత్యంత కీలకం కానుంది.
రవీంద్ర జడేజా రీఎంట్రీతో పెరిగిన బలం
భారత జట్టుకు ప్రధాన ప్లస్ పాయింట్ ఏంటంటే స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి రావడం. టెన్నిస్ ఎల్బో గాయం నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్న జడేజా ఎంపికకు అందుబాటులోకి వచ్చాడు. లంకలోని స్పిన్ పిచ్‌లపై జడేజా బ్యాటింగ్, బౌలింగ్ అనుభవం భారత్‌కు చాలా పెద్ద బలంగా మారనుంది. ఇక బ్యాటింగ్ విభాగంలో చూస్తే ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మిడిల్ ఆర్డర్ బాధ్యతలను భుజాన వేసుకోనున్నాడు. యంగ్ ప్లేయర్ సాయి సుదర్శన్ ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత రాకపోవడంతో, ఆయన స్థానంలో దేవదత్ పడిక్కల్‌కు అవకాశం లభించవచ్చు. సర్ఫరాజ్ ఖాన్ కూడా జట్టులో తన స్థానాన్ని నిలుపుకునే అవకాశం ఉంది. ఇక వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ మొదటి ఛాయిస్‌గా ఉండగా, బ్యాకప్‌గా ధ్రువ్ జురెల్ ఎంపిక కావడం దాదాపు ఖాయమే.
లక్ష్యం స్పిన్ అస్త్రాలు.. కొత్త ముఖాలకు ఛాన్స్
శ్రీలంకలో మ్యాచ్‌లు అనగానే స్పిన్నర్లదే హవా. అందుకే జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లు ప్రధాన స్పిన్ అస్త్రాలుగా బరిలోకి దిగనున్నారు. వీరికి తోడుగా రీసెంట్గా శ్రీలంక ‘ఎ’ జట్టుపై అటు బంతితో, ఇటు బ్యాట్‌తో అద్భుతంగా రాణించిన సరాంశ్ జైన్‌కు జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మానవ్ సుతార్ కూడా సెలెక్టర్ల రేసులో ఉన్నాడు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో కుర్రాడు గుర్నూర్ బ్రార్ తన సత్తాతో ఎంపిక కమిటీ దృష్టిని ఆకర్షించగలిగాడు.
సెలెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారిన గాయాలు
ప్రస్తుతం భారత క్రికెట్ బోర్డు ముందున్న అతిపెద్ద సవాల్ కీలక ఆటగాళ్ల గాయాలే. ఫాస్ట్ బౌలింగ్ సంచలనం జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయంతో బాధపడుతుండటంతో, మెడికల్ రిపోర్ట్ ఆధారంగానే అతని ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నారు. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తొడ కండరాల గాయం నుంచి కోలుకుంటున్నందున, అతను మొదటి టెస్టుకు అందుబాటులో ఉండటం కష్టమేనని సమాచారం. మరోవైపు పేసర్లు హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డిలు గాయాల కారణంగా ఇప్పటికే ఈ సిరీస్‌కు దూరమయ్యారు. ఏది ఏమైనా శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని యంగ్ టీమిండియా లంక గడ్డపై జెండా పాతాలని పట్టుదలతో ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..