Headlines

గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం.. భారత్‌కు తొలి పసిడి పతకం..!

గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం.. భారత్‌కు తొలి పసిడి పతకం..!


గ్లాస్గో క్రీడల్లో నాలుగో రోజు భారత అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. మహిళల 48 కేజీల ఫైనల్ పోటీలు ప్రారంభం కావడంతో అందరి చూపులు ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చానుపైనే నిలిచాయి. స్నాచ్ విభాగంలో తన తొలి ప్రయత్నంలో 82 కేజీల బరువు ఎత్తడంలో ఆరంభంలో చిన్న తడబాటు ఎదురైంది. అయితే ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా రెండో ప్రయత్నంలో 82 కేజీల బరువును సునాయాసంగా ఎత్తి పోటీలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇక ఆఖరి ప్రయత్నంలో ఏకంగా 85 కేజీల బరువును ఎత్తి కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే సరికొత్త స్నాచ్ రికార్డును నమోదు చేసింది.

క్లీన్ అండ్ జెర్క్‌లోనూ అదే ఆధిపత్యం..

స్నాచ్ ముగిసే సమయానికే ప్రత్యర్థుల కంటే ఏకంగా 8 కేజీల ఆధిక్యంలో నిలిచిన మీరాబాయి, క్లీన్ అండ్ జెర్క్ విభాగంలోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. క్లీన్ అండ్ జెర్క్‌లో మొదట 105 కేజీల బరువును అద్భుతంగా ఎత్తింది. మొత్తంమీద 190 కేజీల బరువును ఎత్తి సరికొత్త కామన్వెల్త్ గేమ్స్ కాంబినేషన్ రికార్డును నెలకొల్పింది. ఈ విభాగంలో నైజీరియాకు చెందిన రుత్ అసుక్వో 168 కేజీలతో వెండి పతకం దక్కించుకోగా, మలేషియాకు చెందిన ఐరిన్ జేన్ హెన్రీ 167 కేజీలతో కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.

హ్యాట్రిక్ స్వర్ణంతో చరిత్ర సృష్టించిన మణిపూర్ స్టార్..

31 ఏళ్ల మీరాబాయి చాను కామన్వెల్త్ గేమ్స్‌లో వరుసగా మూడోసారి పసిడి పతకాన్ని ముద్దాడటం విశేషం. గతంలో 2018 గోల్డ్ కోస్ట్, 2022 బర్మింగ్‌హామ్ క్రీడల్లోనూ ఆమె స్వర్ణ పతకాలను గెలుచుకుంది. ఈ ఏడాది గ్లాస్గోలో సాధించిన ఈ విజయంతో కామన్వెల్త్ క్రీడల్లో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించిన అరుదైన భారతీయ అథ్లెట్ల జాబితాలో చేరిపోయింది. ఈ మైలురాయితో దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు, ప్రముఖుల నుంచి ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

బారత పతకాల ఖాతాకు కొండంత బలం..

గ్లాస్గో క్రీడల్లో తొలి మూడు రోజులు భారత్‌కు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. నాడా నిషేధాలు, ఇతర అడ్డంకుల వల్ల భారత బృందం కొంత నిరాశలో మునిగింది. అటువంటి సమయంలో వెయిట్‌లిఫ్టర్లు భారత పతకాల ఆశలను నిలబెట్టారు. ఉదయాన్నే పురుషుల 60 కేజీల విభాగంలో రిషికాంత్ సింగ్ చనాంబమ్ వెండి పతకం సాధించి శుభారంభం ఇవ్వగా, మీరాబాయి పసిడి పతకంతో భారత్ ఖాతాను బంగారంతో నింపేసింది.కష్ట సమయాల్లోనూ అచంచలమైన పట్టుదలతో పోరాడి రికార్డు స్థాయి ప్రదర్శనతో స్వర్ణం గెలిచిన మీరాబాయి చాను యువ అథ్లెట్లకు ఆదర్శంగా నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయంతో గ్లాస్గో క్రీడల్లో భారత పతకాల వేట మరింత వేగవంతం కానుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *