భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దులో మరోసారి అలజడి మొదలైంది. జమ్మూ-కశ్మీర్‌లోని సాంబా, కతువా జిల్లాల్లో సరిహద్దు వెంబడి అనుమానాస్పద డ్రోన్‌ల కదలికలు కలకలం సృష్టించాయి. దీంతో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో డ్రోన్‌లు కనిపించడంతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బంది విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు.
భద్రతా దళాల అధికారుల సమాచారం ప్రకారం, శుక్రవారం (జూలై 24) రాత్రి పొద్దుపోయిన తర్వాత సాంబా జిల్లాలోని విజయ్‌పూర్ ప్రాంతం తరోరే గ్రామం వద్ద ఆకాశంలో ఒక అనుమానాస్పద వస్తువును భద్రతా సిబ్బంది గుర్తించారు. అది పాకిస్తాన్‌కు చెందిన డ్రోన్ అయి ఉండవచ్చని అనుమానించిన అధికారులు వెంటనే డ్రోన్ నిరోధక చర్యలు చేపట్టారు. అయితే ఆ డ్రోన్ అంతర్జాతీయ సరిహద్దును దాటి తిరిగి పాకిస్తాన్ వైపు వెళ్లిపోయినట్లు భావిస్తున్నామని తెలిపారు.
ఇదే సమయంలో కతువా జిల్లాలోని హిరానగర్ సెక్టార్‌లోని చక్ నలువా గ్రామంపై మరో అనుమానాస్పద డ్రోన్ ఎగురుతూ కనిపించినట్లు అధికారులు వెల్లడించారు. బోబియా ప్రాంతంలో కూడా డ్రోన్ కదలికలు గుర్తించినట్లు సమాచారం. దీంతో ఆయా ప్రాంతాల్లో భద్రతా బలగాలు అప్రమత్తమై తనిఖీలు చేపట్టాయి. డ్రోన్‌ల ద్వారా ఏదైనా ఆయుధాలు, మందుగుండు సామగ్రి లేదా ఇతర అనుమానాస్పద వస్తువులు పడవేశారా అనే కోణంలో భద్రతా దళాలు పరిశీలిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి, ఎలాంటి చొరబాట్లు లేదా అక్రమ కార్యకలాపాలను అడ్డుకునేందుకు నిఘా పెంచినట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..