Headlines

మతి మరుపు కాదు.. అది డిమెన్షియా..! మైండ్‌ను కాపాడుకునేందుకు 9 బంగారు సూత్రాలు ఇవే..

మతి మరుపు కాదు.. అది డిమెన్షియా..! మైండ్‌ను కాపాడుకునేందుకు 9 బంగారు సూత్రాలు ఇవే..


ప్రపంచవ్యాప్తంగా డిమెన్షియా కేసులు పెరుగుతున్నాయి.. డిమెన్షియా (చిత్తవైకల్యం) అనేది మెదడు పనితీరు తగ్గిపోవడం వల్ల వచ్చే జ్ఞాపకశక్తి లేమి, ఆలోచనలు మారడం, పనులు సరిగ్గా చేయలేకపోవడం వంటి సమస్యల సమూహం. ఇది సాధారణ వృద్ధాప్యంలో వచ్చే సాధారణ మతిమరుపు కంటే చాలా తీవ్రమైనదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 5.7 కోట్లకు పైగా ప్రజలు డిమెన్షియాతో బాధపడుతుంటే.. ప్రతి ఏటా కోటి వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే, ఈ భయాందోళనల నడుమ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక తీపి కబురు అందించింది. మన రోజువారీ అలవాట్లను కాస్త మార్చుకుంటే డిమెన్షియా వచ్చే ముప్పును ఏకంగా 45 శాతం వరకు నివారించవచ్చు లేదా ఆలస్యం చేయవచ్చు అని వెల్లడించింది. మరి మెదడును చురుగ్గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి నేటి నుంచే అలవాటు చేసుకోవాల్సిన ఆ సింపుల్ లైఫ్‌స్టైల్ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

మెదడును కాపాడుకునే 9 బంగారు సూత్రాలు..

1. శారీరక శ్రమ తప్పనిసరి.. రోజూ కాసేపు నడక, వ్యాయామం చేయడం వల్ల మెదడుకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది.

2. పౌష్టికాహారం తీసుకోవడం.. ఆకుకూరలు, కూరగాయలు, సమతుల్య ఆహారం డిమెన్షియాను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

3. ధూమపానానికి స్వస్తి.. స్మోకింగ్ వల్ల మెదడు కణాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి పొగతాగే అలవాటును మానెయ్యాలి.

4. మద్యపానం పరిమితం.. అతిగా మద్యం సేవించడం డిమెన్షియా ప్రమాదాన్ని పెంచుతుంది.

5. సామాజిక సంబంధాలు… నలుగురితో కలవడం, మాట్లాడటం, స్నేహితులు లేదా కుటుంబంతో సమయం గడపడం మెదడును ఒత్తిడికి గురికాకుండా చూస్తాయి.

6. బ్రెయిన్ ఎక్సర్‌సైజ్.. కొత్త విషయాలు నేర్చుకోవడం, పుస్తకాలు చదవడం, పజిల్స్ పూర్తి చేయడం వంటివి మెదడుకు పనిపెట్టిదాన్ని చురుగ్గా ఉంచుతాయి.

7. నాన్-స్టాప్ హెల్త్ చెకప్స్.. అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్‌లను ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం..

8. కాలుష్యానికి దూరంగా.. గాలి కాలుష్యం బారిన పడకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకోండి.

9. వినికిడి సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు.. వినికిడి లోపం ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయకండి. వైద్యుల సలహాతో హియరింగ్ ఎయిడ్స్ లాంటి పరికరాలు వాడటం వల్ల డిమెన్షియా ముప్పు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

డిమెన్షియాను నివారించడానికి ఆ విటమిన్లు, ఈ సప్లిమెంట్లు వాడాలని ప్రచారంలో ఉన్న వార్తలను నిపుణులు కొట్టిపారేశారు. శరీరంలో వైద్యులు నిర్ధారించిన లోపాలు ఏవీ లేకపోతే.. ప్రత్యేకంగా విటమిన్ B, విటమిన్ E, ఒమేగా-3 లేదా మల్టీవిటమిన్ టాబ్లెట్లు వాడటం వల్ల డిమెన్షియా తగ్గుతుందనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు. జీవితాంతం తోడుండేది మీ మెదడే..నేడు మీరు తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు రేపటి రోజున మీ జ్ఞాపకశక్తిని భద్రంగా కాపాడుతాయని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *