MI, IPL 2026: నాడు ఛీ కొట్టారు.. నేడు తల పట్టుకున్నారు.. ముంబై కొంప ముంచిన ‘ఆ ముగ్గురు’

MI, IPL 2026: నాడు ఛీ కొట్టారు.. నేడు తల పట్టుకున్నారు.. ముంబై కొంప ముంచిన ‘ఆ ముగ్గురు’


Mumbai Indians: 2020లో రోహిత్ శర్మ నేతృత్వంలో ఐదో టైటిల్ గెలిచిన తర్వాత ముంబైకి మళ్లీ ట్రోఫీ దక్కలేదు. ముఖ్యంగా రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించడం ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. పాండ్యా సారథ్యంలో ముంబై ఇప్పటివరకు 37 మ్యాచ్‌ల్లో 22 ఓటములను చవిచూసింది. అయితే కేవలం కెప్టెన్సీ మాత్రమే కాదు, ప్రతిభావంతులైన ఆటగాళ్లను వదులుకోవడం (Releases) కూడా ముంబై కొంపముంచిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముంబై వదులుకున్న ఏ ముగ్గురు ఆటగాళ్లు ఇప్పుడు ఇతర జట్లలో మంటలు పుట్టిస్తున్నారో చూద్దాం.

1. టిమ్ డేవిడ్: ఆర్సీబీకి దొరికిన ఫినిషింగ్ బాహుబలి..

టిమ్ డేవిడ్ 2022 నుంచి 2024 వరకు ముంబై ఇండియన్స్‌లో కీలక సభ్యుడిగా ఉన్నాడు. 171.35 స్ట్రైక్ రేట్‌తో మెరుపులు మెరిపించినప్పటికీ, మెగా వేలానికి ముందు ముంబై అతడిని రిటైన్ చేసుకోలేదు. ఫలితంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అతడిని చేజిక్కించుకుంది.

ఆర్సీబీలో టిమ్ డేవిడ్ గణాంకాలు:

17 ఇన్నింగ్స్‌లు

379 పరుగులు

63.17 సగటు

186.27 స్ట్రైక్ రేట్

ప్రస్తుతం ఆర్సీబీ తరపున డేవిడ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడుతూ మ్యాచ్ విన్నర్‌గా నిలుస్తున్నాడు. మరోవైపు ముంబైలో ఫినిషింగ్ చేసే సరైన ఆటగాడు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్ వంటి వారు డేవిడ్ స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నారు.

2. జోఫ్రా ఆర్చర్: రాజస్థాన్ రాయల్స్‌లో నిప్పులు చెరుగుతున్న వేగం..

2022 వేలంలో ముంబై భారీ ఆశలతో ఆర్చర్‌ను దక్కించుకుంది. బుమ్రా-ఆర్చర్ ద్వయం ఐపీఎల్‌ను శాసిస్తుందని అందరూ భావించారు. కానీ ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఆర్చర్ ముంబైకి దూరం కావాల్సి వచ్చింది. అయితే, ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న ఆర్చర్ పాత ఫామ్‌ను అందుకున్నాడు. 10 మ్యాచ్‌ల్లోనే 15 వికెట్లు తీసి ప్రత్యర్థులను వణికిస్తున్నాడు. ముంబై పవర్ ప్లేలో వికెట్లు తీయలేక ఇబ్బంది పడుతుంటే, అటు ఆర్చర్ మాత్రం అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో రాణిస్తుండటం ముంబైకి తీరని లోటే.

3. అన్షుల్ కాంబోజ్: చెన్నై సూపర్ కింగ్స్ ‘సర్ప్రైజ్ ప్యాకేజీ’..

2024లో ముంబైతో ప్రయాణాన్ని మొదలుపెట్టిన యువ పేసర్ అన్షుల్ కాంబోజ్‌కు సరైన అవకాశాలు లభించలేదు. దీంతో అతడిని వేలంలోకి వదలగా, చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అతడిని కొనుగోలు చేసింది. ఈ నిర్ణయం సీఎస్‌కేకు వజ్రం దొరికినట్టయింది. 2026 సీజన్‌లో ఇప్పటికే 17 వికెట్లు పడగొట్టిన కాంబోజ్, పర్పుల్ క్యాప్ రేసులో దూసుకుపోతున్నాడు. ముంబై మేనేజ్‌మెంట్ అనుభవం లేని దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ వంటి వారి కోసం రూ. 11.25 కోట్లు ఖర్చు చేసి చేతులు కాల్చుకోగా, కాంబోజ్ వంటి యువ ప్రతిభను వదులుకొని భారీ మూల్యం చెల్లించుకుంది.

ముంబై ఇండియన్స్ పతనం కేవలం మైదానంలో ఆటవల్లే కాదు, వేలంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల కూడా అని స్పష్టమవుతోంది. సరైన వనరులను గుర్తించడంలో విఫలమవ్వడం వల్లనే ఐదుసార్లు ఛాంపియన్ అయిన జట్టు ఇప్పుడు కనీసం పోటీలో కూడా ఉండలేకపోతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *