ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే సర్వే సంస్థలు ఫలితాలు వెల్లడించాయి. ఈ క్రమంలో గెలిచే పార్టీలు.. వాటి సీట్ల సంఖ్యపై పందాలు జోరందుకున్నాయి. అందరి చూపు పశ్చిమబెంగాల్, తమిళనాడు ఫలితాలపైనే. దీంతో ఆ రెండు రాష్ట్రాల్లో రిజల్ట్స్‌పై బెట్టింగ్ జోరుగా సాగుతోంది. పందాలపై పోలీసుల నిఘా పెరగడంతో బెట్టింగ్ రాయుళ్లు రూట్ మార్చారు. ఐపీఎల్ తరహాలో ప్రత్యేక యాప్‌లో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఫోన్ కాల్ అవసరం లేకుండా ఆర్థిక లావాదేవీల వివరాలన్నీ యాప్ ద్వారానే జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. పోటీ ఏదైనా.. ఎక్కడైనా.. బెట్టింగ్ ఖాయం అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఫలానా రాష్ట్రంలో.. ఫలానా పార్టీ అధికారంలోకి రాబోతుందని.. సదరు నియోజకవర్గంలో పలానా అభ్యర్థి గెలవబోతున్నారంటూ భారీగా పందాలు కాస్తున్నారు. వందకు వెయ్యి.. వెయ్యికి లక్ష అంటూ బెట్టింగ్ బంగార్రాజులు పందాలు కాస్తున్నారు. పెద్ద లీడర్లు తలపడుతున్న నియోజకవర్గాల్లో ఎవరికి ఎంత మెజార్టీ వస్తుందన్న దానిపై పందాలు కాస్తున్నారు. ఎక్కడ ఎవరు గెలవబోతున్నారు.. అధికారంలోకి ఎవరు రాబోతున్నారు.. ప్రతీ గల్లీలో ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ నడుస్తోంది.
అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల 2026 శాసనసభ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం మే 4న ప్రకటించనుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కించే ప్రామాణిక ప్రక్రియను అనుసరించి, సోమవారం సాయంత్రానికల్లా ఫలితం వెలువడే అవకాశం ఉంది.
ఫలితాల తేదీ, సమయం:
తేదీ: మే 4, సోమవారం
లెక్కింపు: ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది.
తొలి ట్రెండ్స్: తొలి రెండు, మూడు గంటల్లోనే ట్రెండ్స్‌పై ఓ క్లారిటీ వస్తుంది
తుది ఫలితాలు: లెక్కింపు రౌండ్ల వేగాన్ని బట్టి, బహుశా మధ్యాహ్నం లేదా సాయంత్రానికి వెలువడే అవకాశం ఉంది.
ఓట్లను ఎలా లెక్కిస్తారు?
భారత ఎన్నికలలో ఓట్ల లెక్కింపు, ఎన్నికల సంఘం (EC) పర్యవేక్షణలో ఒక క్రమబద్ధమైన, దశలవారీ ప్రక్రియను అనుసరిస్తుంది. ఇది ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమవుతుంది. ఈ బ్యాలెట్లను సర్వీస్ ఓటర్లు, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది, దివ్యాంగులు వంటి నిర్దిష్ట వర్గాల వారు వేస్తారు. చట్టపరమైన నిబంధనల ప్రకారం ఈ బ్యాలెట్లను మొదట లెక్కిస్తారు, ఆ తర్వాత ముందుకు వెళ్లే ముందు వాటి మొత్తం ఓట్లను నమోదు చేస్తారు.
దీని తర్వాత, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో (EVMలలో) నమోదైన ఓట్లను లెక్కిస్తారు, ఈ ప్రక్రియ సాధారణంగా సుమారు 30 నిమిషాల తర్వాత ప్రారంభమవుతుంది. కాగితపు బ్యాలెట్ల వలె కాకుండా, అధికారులు, పార్టీ ప్రతినిధుల సమక్షంలో ఫలితాల బటన్‌ను నొక్కినప్పుడు, EVMలు ప్రతి అభ్యర్థికి నమోదైన మొత్తం ఓట్లను ప్రదర్శిస్తాయి. పోస్టల్ బ్యాలెట్లు, ఈవీఎం లెక్కింపులతో సహా అన్ని దశలు పూర్తయి, ధృవీకరించబడిన తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు. మీరు పోల్ ఫలితాలు, విశ్లేషణను ఇక్కడే tv9telugu.comలో ట్రాక్ చేయవచ్చు. అదనంగా, ఇది TV9 యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.
ఎలక్షన్ టాప్ నైన్ న్యూస్ దిగువన చూద్దాం..
1) ఓట్ల లెక్కింపులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను సూపర్వైజర్లుగా నియమించడాన్ని సవాల్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఆదేశాలు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. కౌంటింగ్ సిబ్బందిని ఎంచుకునే స్వేచ్ఛ ఎన్నికల సంఘానికి ఉందని స్పష్టం చేసింది. శనివారం సెలవు అయినప్పటికీ ఈ పిటిషన్ విచారించేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేకంగా సమావేశమైంది.
2) స్ట్రాంగ్ రూములల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తుండటంతో కౌంటింగ్ సందర్భంగా ఎన్నికల సంఘం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. బెంగాల్లో లెక్కింపు సందర్భంగా 165 మంది అదనపు కౌంటింగ్ పరిశీలలకులు, 77 మంది పోలీసు పరిశీలకులను నియమించింది.
3) గడిచిన రెండు నెలలుగా జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం ఉదయం ఓట్ల లెక్కింపు జరగనుంది.
4) రెండొందలకు పైగా సీట్లలో విజయం సాధించబోతున్నామని TMC అధ్యక్షురాలు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పార్టీ శ్రేణులకు తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్లతో ఆమెతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎగ్జిట్ పోల్స్ అనేవి స్టాక్‌మార్కెట్‌ను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని మమత తెలిపారు. 2021, 2024లోనూ ఇలాగే చేశారని మమత వివరించారు.
5) బెంగాల్‌లోని డైమండ్ హార్బార్, మగ్రాహాత్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 15 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ నిర్వహించారు. మండుతున్న ఎండలను లెక్కచేయకుండా ఓటర్లు ఓటు వేశారు. మొత్తం 15 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌ను ఎన్నికల అధికారులు వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు.
6) బెంగాల్లో రీపోలింగ్ సందర్భంగా స్థానికులు భారీ ఆందోళన చేపట్టారు. TMC నేతలు బెదిరిస్తున్నారని స్థానికుల నిరసనకు దిగారు. ఇళ్లకు వచ్చి వాళ్లు తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి ఓటెయ్యలేదన్న కోపంతో తమను బెదిరిస్తున్నారని తెలిపారు. రీపోలింగ్‌లో తమను ఓటెయ్యకుండా టీఎంసీ నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు
7) పని ద్వారా బీజేపీ మళ్లీ గెలవలేదు కాబట్టే చోరీ ద్వారా తనను కాపాడుకుంటోందని అస్సాం పీసీసీ అధ్యక్షుడు గౌరవ్ గొగయ్ ఆరోపించారు. స్ట్రాంగ్ రూమ్స్ నిర్వహణలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని తెలిపారు. ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ప్రశ్నించారు. స్ట్రాంగ్ రూమ్స్ లోపల బీజేపీ కార్యకర్తలు ఉంటున్నారని గొగయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
8) తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తాను గౌహతి వచ్చానని కర్నాటక డిప్యూటీ సీఎం DK శివకుమార్ తెలిపారు. అస్సాంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అభ్యర్థులతో ఆయన భేటీ అయ్యారు. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ కూడా గౌహతి వచ్చారు. ఎగ్జిట్ పోల్స్‌ను తాను నమ్మనని శివకుమార్ అన్నారు.
9) తమిళనాడులో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్లలో భద్రతను బలోపేతం చేయాలని TVK పార్టీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అధవ అర్జున, చెన్నైలోన తమిళనాడు ఎన్నికల ప్రధానాధికారి అర్చనా పట్నాయక్‌ను కలిశారు. శ్రీరంగంలోని తమ పార్టీ కార్యాలయంపై దాడికి సంబంధించి కూడా TVK ఫిర్యాదు చేసింది.
మహానది గర్భంలో మర్మం.. ఒక వలలో చిక్కిన విగ్రహంతో బయటపడ్డ నిజం!