ఎన్నికల ఫలితాల వేళ, దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు గడువు దగ్గరపడుతున్న కొద్దీ, అటు ఎగ్జిట్ పోల్స్, ఇటు ముంబై బెట్టింగ్ మార్కెట్ అంచనాలు హీటెక్కిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడులలో నెలకొన్న ఉత్కంఠ ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తోంది.
బెంగాల్లో కాషాయ దళం చరిత్ర సృష్టించేనా?
పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 స్థానాలకు గాను మెజారిటీ మార్కు 148. ముంబై బెట్టింగ్ మార్కెట్ అంచనాల ప్రకారం, ఈసారి భారతీయ జనతా పార్టీ 175-185 స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసే దిశగా ఉంది. అదే జరిగితే, మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ (TMC) పదేళ్ల పాలనకు ముగింపు పలకడమే కాకుండా, బెంగాల్ మట్టిపై బీజేపీ సరికొత్త రికార్డు సృష్టిస్తుంది. మమతా బెనర్జీ 127-132 స్థానాలకే పరిమితమవుతారని బుకీలు పందాలు కాస్తున్నారు. నందిగ్రామ్ వంటి కీలక స్థానాల్లో సువేందు అధికారి హవా కొనసాగుతుందని బెట్టింగ్ రాయుళ్లు నమ్మకంగా ఉన్నారు.
తమిళనాడులో ‘దలపతి’ ఎంట్రీ..?
తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా ముక్కోణపు పోటీ కనిపిస్తోంది. మొత్తం 234 స్థానాల్లో డీఎంకే (DMK) 145-155 స్థానాలతో మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంచనాలు చెబుతున్నాయి. అయితే, ఈసారి అందరి కళ్లు నటుడు విజయ్ స్థాపించిన టీవీకే (TVK) పైనే ఉన్నాయి. విజయ్ పార్టీ 7-9 స్థానాలు సాధిస్తుందని ప్రాథమిక అంచనాలు ఉన్నప్పటికీ, యువత ఓట్లు చీలితే ఫలితాలు తలకిందులయ్యే అవకాశం ఉంది. అటు ఏఐఏడీఎంకే (AIADMK) కేవలం 45-65 సీట్లకే పరిమితం కావొచ్చని మార్కెట్ జోస్యం చెబుతోంది.
అస్సాం, కేరళలో పాత రికార్డుల ప్రక్షాళన!
అస్సాంలో బీజేపీ ఆధిపత్యం చెక్కుచెదరనట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ నేతృత్వంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం దిశగా దూసుకెళ్తోంది. 126 స్థానాల్లో బీజేపీ కూటమికి 85-92 సీట్లు వచ్చే అవకాశం ఉండగా, కాంగ్రెస్ 34-38 స్థానాలకే సరిపెట్టుకోవచ్చని బుకీలు అంచనా వేస్తున్నారు. ఈ దిశగా బెట్టింగ్ జోరందుకుంది. మరోవైపు, దశాబ్దాల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కేరళ ఓటరు మళ్లీ మార్పు కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఎల్డీఎఫ్ (LDF) కు షాక్ ఇస్తూ, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) 78-85 స్థానాలతో అధికారాన్ని చేజిక్కించుకోనుందని బుకీలు అంచనా వేస్తున్నారు. ఇక్కడ బీజేపీ 2-3 స్థానాలు గెలుచుకుంటాయని భావిస్తున్నారు.
పుదుచ్చేరిలో హోరాహోరీ..!
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 స్థానాలకు గాను ఎన్డీఏ (NDA) 15-18 సీట్లు, ఇండియా కూటమి 14-17 సీట్లతో హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు కింగ్ మేకర్లుగా మారే అవకాశం ఉంది.
ఇదిలావుంటే, ముంబై బెట్టింగ్ మార్కెట్లో ఒక పార్టీ లేదా అభ్యర్థి గెలుపు అవకాశాల ఆధారంగా రేట్లు నిర్ణయిస్తారు. బలమైనదిగా భావించే పార్టీకి తక్కువ రేటు ఉంటుంది. అయితే బలహీనమైనదిగా భావించే పార్టీకి ఎక్కువ రేటు ఉంటుంది. ఈ బెట్టింగ్ మార్కెట్ సాధారణంగా స్థానిక బుకీల నెట్వర్క్ ద్వారా పనిచేస్తుంది. వీరు ఫోన్, వాట్సాప్, ఇతర మార్గాల ద్వారా పందాలను స్వీకరిస్తారు. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్, ర్యాలీలు, రాజకీయ పరిణామాల ఆధారంగా ఈ రేట్లు నిరంతరం మారుతూ ఉంటాయి.
ముఖ్య గమనిక: బెట్టింగ్ మార్కెట్ అంచనాలు కేవలం ఊహల పైన, క్షేత్రస్థాయి బుకీల నెట్వర్క్ సమాచారం పైన ఆధారపడి ఉంటాయి. వాస్తవ ఫలితాలు మే 4న వెలువడే వరకు ఏ పార్టీ గెలుపునైనా అధికారికంగా నిర్ధారించలేం. రాజకీయ విశ్లేషకులు ఎగ్జిట్ పోల్స్‌ను నమ్ముతుంటే, పందెం కోళ్లు మాత్రం ముంబై బెట్టింగ్ మార్కెట్ రేట్లనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. మరి ప్రజాతీర్పు ఎటువైపు ఉందో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..