తెలుగు సినీ పరిశ్రమలో తనకెళ్ల భరణి, బ్రహ్మానందంల స్నేహం ఎంతో ప్రత్యేకమైనది. తనకెళ్ల భరణి ప్రకారం, బ్రహ్మానందం ఆయనకు అతి కొద్దిమంది ఆత్మీయులలో ఒకరు. ప్రకాష్ రాజ్, నాజర్, షఫీ, ఎల్బీ శ్రీరామ్ వంటి వారితో పాటు బ్రహ్మానందం కూడా ఈ జాబితాలో ఉన్నారని గతంలో ఓ ఇంటర్వ్యూలో భరణి ఆసక్తికర కామెంట్స్ చేశారు. భరణి ఏదైనా రాసినప్పుడు మొదట బ్రహ్మానందానికి వినిపిస్తారట, బ్రహ్మానందం సాహిత్యంపై మంచి పట్టున్నవారు కాబట్టి ఆయన సలహాలు తీసుకుంటారట. మేము దాదాపు ప్రతిరోజు మాట్లాడుకుంటాం అని భరణి తెలిపారు. బ్రహ్మానందం విష్ణు భక్తుడు, వెంకటేశ్వర స్వామిని కొలుస్తాడు.. కాగా తనకెళ్ల భరణి శివ భక్తుడు. ఒకసారి షూటింగ్ నిమిత్తం ఇద్దరు ఒక చిన్న పల్లెటూరికి వెళ్లినప్పుడు, అక్కడి చిన్న ఆలయాన్ని సందర్శించారట.. అప్పటికే ఆలయంలో పూజ చేస్తున్న అర్చకుడు, వీరిని చూసినా తన పనిని కొనసాగించాడట. సెలబ్రిటీలుగా తమకు లభించే ప్రత్యేక ఆదరణ దక్కకపోవడంతో వారు కొద్దిగా నిరాశ చెందారట. అభిషేకం చేయించాలనుకుంటున్నామని అడగగా, పూజారి సమయం అయిపోయిందని, మరుసటి రోజు ఉదయం 7 గంటలకు రావాలని చెప్పాడట.
ఇది కూడా చదవండి : ఆ హీరో పిలిచి తిడతాడనుకున్నా.. కానీ ఆయన చేసిన పనికి షాక్ అయ్యా
మరుసటి రోజు ఉదయం, తనకెళ్ల భరణి, బ్రహ్మానందం ఆలయానికి కొంచెం ముందుగానే చేరుకొని, శ్రద్ధగా అభిషేకం చేయించుకున్నారట. అనంతరం పూజారికి దక్షిణ ఇవ్వబోగా, ఆయన ఒక చిన్న హుండీని చూపించారు. వారు బయట కూర్చుని టిఫిన్ చేస్తున్న సమయంలో, పూజారి తన పాత పంచె, కండువాతో, ఎలాంటి ఆభరణాలు లేకుండా ఆలయాన్ని మూసేసి వెళ్తున్నాడు. భరణి, బ్రహ్మానందం ఆయనకు టిఫిన్, కాఫీ, పాలు వంటి వాటిని అందించబోగా, పూజారి మర్యాదగా నిరాకరించాడట. “అదేంటి సార్, మీరు ఏమీ తీసుకోరు, దక్షిణ ఇవ్వబోతే హుండీ చూపించారు” అని అడగ్గా, ఆ పూజారి నిర్మలంగా, “సార్, నాకు ఒక ఎకరం పొలం ఉంది, మా నాన్నకు ఒక ఆవు ఉంది, ఒక శివుడు ఉన్నాడు, ఇంకేం కావాలి సార్?” అని జవాబిచ్చాడట.
ఇది కూడా చదవండి : Talluri Rameswari: నా రెమ్యునరేషన్ గురించి ఆ స్టార్ హీరో అలా అనేసరికి షాక్ అయ్యా..!
పూజారి ఈ మాటలు చెప్పి వెళ్ళిపోతుండగా, “మాలో ఉన్న అహంకారం రాలి కుప్పలా పడింది” అని తనకెళ్ల భరణి కవిత్వం రాశారట. ఎవరినీ ఆశించకపోతే ఇంత రిచ్‌గా ఉండవచ్చునని, నిజమైన శ్రీమంతుడు అంటే ఆ పూజారే అని భరణి పేర్కొన్నారు. ఈ సంఘటన భరణిని ఎంతగానో ప్రభావితం చేసిందని. ఈ స్ఫూర్తితో “మా సెడ్డ మంచోడు దేవుడు” అనే పాటను కూడా రాశారట. ఈ పాటలో “నువ్వొకటి అడిగితే ఆడొకటి ఇస్తాడు మా సెడ్డ మంచోడు దేవుడు. అస్సలు అడగకపోతే, అస్సలు అడగకపోతే అన్నీ ఇచ్చేస్తాడు మా సెడ్డ మంచోడు దేవుడు” అనే పంక్తులు పూజారి నిస్వార్థ వైఖరిని ప్రతిబింబిస్తాయని భరణి తెలిపారు.
ఇది కూడా చదవండి : ఎక్స్ క్లూజివ్ కంటెంట్ ఇస్తా.. ఇన్ స్టా సబ్స్క్రిప్షన్ మొదలు పెట్టిన రామ్ చరణ్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.