IPL 2026 : ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ టీం అదిరిపోయే విజయాలతో దూసుకుపోతుంది. పంజాబ్ కింగ్స్ విజయాల పరంపరకు బ్రేక్ వేసి పాయింట్ల పట్టికలో తన సత్తా చాటింది. అయితే ఈ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. లైవ్ టీవీ కెమెరాలకు రియాన్ పరాగ్ ఈ-సిగరెట్ కాలుస్తూ అడ్డంగా దొరికిపోయాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవ్వడంతో ఇప్పుడు నెట్టింట పెద్ద దుమారమే రేగుతోంది.
అసలేం జరిగిందంటే?
చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య హోరాహోరీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ గెలిచిన ఉత్సాహంలో రాజస్థాన్ ఆటగాళ్లు ఉండగా, డ్రెస్సింగ్ రూమ్‌లో కెప్టెన్ రియాన్ పరాగ్ తీరిగ్గా కూర్చుని వైపింగ్ చేస్తూ కనిపించాడు. భారత్‌లో 2019 నుంచి ఈ-సిగరెట్లపై పూర్తిస్థాయి నిషేధం ఉంది. ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం (PECA) ప్రకారం ఇది నేరం. అసలు నిషేధిత వస్తువు డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఎలా వచ్చిందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. దీనిపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది.
నిషేధం ఉన్నా పరాగ్ ఎందుకు వాడాడు?
సాధారణంగా స్టేడియం లోపలికి ఎలాంటి నిషేధిత వస్తువులను అనుమతించరు. కానీ కెప్టెన్ హోదాలో ఉన్న ఆటగాడే ఇలాంటి పని చేయడం క్రికెట్ అభిమానులను కలిచివేస్తోంది. యువతకు రోల్ మోడల్‌గా ఉండాల్సిన క్రికెటర్లు ఇలా బహిరంగంగా ధూమపానం చేయడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయని క్రీడా విశ్లేషకులు మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం డ్రెస్సింగ్ రూమ్‌లో ఇలాంటివి వాడటం క్రమశిక్షణారాహిత్యం కిందకు వస్తుంది. పరాగ్‌పై భారీ జరిమానాతో పాటు కొన్ని మ్యాచ్‌ల నిషేధం కూడా పడే ఛాన్స్ ఉంది.
VapeGate hits IPL. Rajasthan Royals cricket #RiyanParag caught on camera, vaping inside the dressing room.
It’s not about habits. It’s about legality. Last I checked, Vapes & ECigerets were banned in India. pic.twitter.com/RyfzRffJA5
— Sai Ram B (@SaiRamSays) April 28, 2026
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ – మ్యాచ్ హైలైట్స్
ఈ వివాదం పక్కన పెడితే మ్యాచ్ మాత్రం చాలా రసవత్తరంగా సాగింది. పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసి 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. మార్కస్ స్టోయినిస్ కేవలం 22 బంతుల్లోనే 62 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ప్రభసిమ్రన్ సింగ్ 59 పరుగులతో రాణించాడు. అయితే ఈ కొండంత లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ వీరోచితంగా ఛేదించింది. డొనావన్ ఫెరీరా 26 బంతుల్లో 52 పరుగులు, యశస్వి జైస్వాల్ 51 పరుగులతో మ్యాచ్‌ను గెలిపించారు. వైభవ్ సూర్యవంశీ, శుభమ్ దూబే మెరుపులు మెరిపించడంతో 19.2 ఓవర్లలోనే రాజస్థాన్ 228 పరుగులు చేసి విజయం సాధించింది.
గతంలోనూ ఇలాంటి సంఘటనలు
క్రికెట్ చరిత్రలో ఆటగాళ్లు సిగరెట్లు లేదా చుట్టలు కాలుస్తూ దొరికిపోవడం ఇదేం మొదటిసారి కాదు. షేన్ వార్న్ నుంచి ఇయాన్ బోథమ్ వరకు చాలామంది ఈ జాబితాలో ఉన్నారు. కానీ ప్రస్తుత కాలంలో ఫిట్‌నెస్ కి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో, అది కూడా నిబంధనలు కఠినంగా ఉన్న భారత్‌లో ఇలాంటివి జరగడం రియాన్ పరాగ్ కెరీర్‌పై ప్రభావం చూపవచ్చు. రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం దీనిపై ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి. బీసీసీఐ యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ దీనిపై ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..