పుచ్చకాయ తింటే ప్రాణాలు పోతాయా..? ముంబై ఫ్యామిలీ మరణాలపై డాక్టర్ల కీలక విషయాలు..

పుచ్చకాయ తింటే ప్రాణాలు పోతాయా..? ముంబై ఫ్యామిలీ మరణాలపై డాక్టర్ల కీలక విషయాలు..


ఆహారపు అలవాట్లలో మనం చేసే చిన్నపాటి అజాగ్రత్తలు ప్రాణాల మీదకు వస్తాయనే చేదు నిజాన్ని ముంబైలో జరిగిన ఒక విషాద ఘటన నిరూపించింది. రాత్రి భోజనంలో బిర్యానీ తిని, ఆపై పుచ్చకాయ తిన్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు కొన్ని గంటల వ్యవధిలోనే మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. బాధితులు తమ బంధువులతో కలిసి రాత్రి భోజనంలో బిర్యానీ తిన్నారు. బంధువులు వెళ్లిపోయిన తర్వాత, ఇంట్లో ఉన్న పుచ్చకాయను ముక్కలుగా కోసుకుని తిన్నారు. అయితే తిన్న కొద్దిసేపటికే ఆ నలుగురికీ విపరీతమైన వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. పరిస్థితి విషమించడంతో వారిని జేజే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ నలుగురూ ప్రాణాలు కోల్పోయారు. జేజే మార్గ్ పోలీసులు దీనిని ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పుచ్చకాయ ప్రాణాంతకమా..?

సాధారణంగా ఆరోగ్యకరమైనదిగా భావించే పుచ్చకాయ మరణానికి కారణం కాగలదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై న్యూట్రిషనిస్ట్ రూపాలి దత్తా, డాక్టర్ అర్చన బాత్రా కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.

బ్యాక్టీరియా వృద్ధి: పుచ్చకాయలో నీటి శాతం, చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల అందులో బ్యాక్టీరియా చాలా వేగంగా పెరుగుతుంది. పండు కలుషితమైతే అది తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్‌‌కు దారితీస్తుంది.

కల్తీల భయం: పుచ్చకాయలు ఎర్రగా, తీపిగా కనిపించడానికి గ్లూకోజ్ లేదా రంగు నీటిని ఇంజెక్ట్ చేస్తున్నట్లు నివేదికలు ఉన్నాయి. ఇలాంటి కలుషిత ద్రవాలు చేరడం వల్ల పండు విషతుల్యంగా మారుతుంది.

తీవ్రత: సెప్సిస్ లేదా కీలక అవయవాలు విఫలం కావడం వల్ల సకాలంలో వైద్యం అందకపోతే మరణం సంభవించే అవకాశం ఉంది.

రాత్రిపూట పుచ్చకాయ తినకూడదా?

  • ఈ ఘటనలో బాధితులు అర్ధరాత్రి సమయంలో పుచ్చకాయ తిన్నట్లు గుర్తించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం:
  • రాత్రి 8 గంటల తర్వాత పండ్లు లేదా బరువైన ఆహారం తీసుకోకపోవడమే మంచిది.
  • నిద్రలో జీర్ణక్రియ నెమ్మదిస్తుంది, దీనివల్ల జీర్ణ సంబంధిత ఇబ్బందులు మరింత తీవ్రమవుతాయి.
  • పుచ్చకాయను ఉదయం లేదా పగటిపూట తీసుకోవడమే అత్యంత సురక్షితం.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • నమ్మకమైన చోట నుండే పండ్లను కొనండి
  • పండ్లను కోయడానికి ముందు శుభ్రంగా కడగాలి.
  • కోసిన పండ్లను ఎక్కువ సేపు బయట ఉంచకూడదు.
  • ఆహారం తిన్న తర్వాత అసాధారణ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

ప్రస్తుతం ఫోరెన్సిక్ నివేదికల కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. ఆ రిపోర్టులు వస్తేనే బిర్యానీ వల్ల ఫుడ్ పాయిజన్ జరిగిందా..? లేక పుచ్చకాయ కారణమా అనేది స్పష్టమవుతుంది. ఏది ఏమైనా, ఆహార పరిశుభ్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *