Viral Video: పోలీస్‌ అధికారి ఇంట్లో పెళ్లి.. శుభలేఖ మామూలుగా లేదు.. చూశారంటే

Viral Video: పోలీస్‌ అధికారి ఇంట్లో పెళ్లి.. శుభలేఖ మామూలుగా లేదు.. చూశారంటే


ఖమ్మం జిల్లాకు చెందిన హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను ఒక సైబర్ పాఠంలా తీర్చిదిద్దడం నిజంగా అభినందనీయం. సాధారణంగా శుభలేఖల్లో కేవలం వివాహ వివరాలు, బంధువుల పేర్లు ఉంటాయి. కానీ, తన వృత్తిపై ఉన్న నిబద్ధతను చాటుకుంటూ, సమాజ క్షేమం కోసం ఆయన చేసిన ఈ ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వినూత్న శుభలేఖలోని ముఖ్యాంశాలు, అది ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటో పూర్తి వివరాల్లోకి వెళితే…

ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు నాగేశ్వరరావు, నాగేశ్వరరావు, విజయలక్ష్మి దంపతుల చిన్న కుమార్తె వివాహం ఈనెల 30న జరగనుంది. ఈ మేరకు పెళ్లి శుభలేఖ అందరిలా కాకుండా తన వృత్తి ధర్మాన్ని కలగలిపి రూపొందించారు. ఇది పలువురిని ఆకట్టుకుంటుంది. పెళ్లికి ఆహ్వానం పలుకుతూనే, సైబర్ నేరాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. సైబర్ హెచ్చరికలు, అపరిచిత లింకులతో జాగ్రత్తలు, ఫ్రీ గిఫ్ట్స్ అంటూ ప్రకటనలకు దూరంగా ఉండటం పార్సిల్లలో జరిగే మోసాలు డిజిటల్ భద్రత పెట్టుబడి మోసాలు ఎలా జరుగుతాయో ప్రతిదీ వివరంగా ఈ శుభలేఖలో పేర్కొన్నారు.

వినూత్న శుభలేఖ- సైబర్ అవగాహన అంశాలు:

అపరిచిత లింకులు: స్మార్ట్‌ఫోన్‌కు వచ్చే తెలియని లింకులను క్లిక్ చేయవద్దని, అలా చేయడం వల్ల వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

ఉచిత కానుకల (Free Gifts) ఆశ: మీకు భారీ గిఫ్ట్ వచ్చింది లేదా లాటరీ తగిలింది అంటూ వచ్చే ప్రకటనలను నమ్మవద్దని సూచించారు.

పార్శిల్ మోసాలు: కొరియర్ సర్వీసుల పేరుతో జరుగుతున్న కొత్త తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వివరించారు.

పెట్టుబడి మోసాలు: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు వస్తాయంటూ ఆశ చూపే ఇన్వెస్ట్‌మెంట్ యాప్స్, స్కీమ్స్ పట్ల జాగ్రత్తలు చెప్పారు.

డిజిటల్ భద్రత: పాస్‌వర్డ్స్, ఓటీపీ (OTP)లను ఎవరికీ షేర్ చేయకూడదని, డిజిటల్ అరెస్టేషన్ వంటి బెదిరింపులకు భయపడకూడదని సూచించారు.

ఈ వివాహ పత్రికలో కేవలం హెచ్చరికలే కాకుండా, ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే తీసుకోవాల్సిన చర్యలను కూడా పొందుపరిచారు. వెంటనే 1930 అనే టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలి.
లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. మోసం జరిగిన మొదటి గంట (Golden Hour)లోనే ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని వివరించారు.

వీడియో ఇక్కడ చూడండి..

సమాజానికి ఒక గొప్ప సందేశం:

ఒక పోలీస్ అధికారిగా నాగేశ్వరరావు తన వృత్తి ధర్మాన్ని ఇంటి శుభకార్యంతో ముడిపెట్టడం వల్ల ఈ ఆహ్వాన పత్రిక ప్రతి ఒక్కరి చేతికి వెళ్ళినప్పుడు చదవక తప్పదు. ఇది కేవలం ఒక పెళ్లి పిలుపు మాత్రమే కాదు, వందలాది కుటుంబాలను ఆర్థిక మోసాల నుండి కాపాడే ఒక జాగృతి పత్రం. ఇలాంటి వినూత్న ఆలోచనలు సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎంతగానో తోడ్పడతాయి. నాగేశ్వరరావు గారి కుమార్తె వివాహం నిర్విఘ్నంగా జరగాలని, నూతన వధూవరులు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిద్దాం.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *