పహల్గామ్ మారణకాండ.. ఇప్పటికీ ఆ దృశ్యం నీడలా వెంటాడుతోంది! కొడుకు కోసం బెంగళూరు డాక్టర్ వీరోచిత పోరాటం!

పహల్గామ్ మారణకాండ.. ఇప్పటికీ ఆ దృశ్యం నీడలా వెంటాడుతోంది! కొడుకు కోసం బెంగళూరు డాక్టర్ వీరోచిత పోరాటం!


జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. సంతోషంగా విహారయాత్రకు వెళ్లిన ఒక కుటుంబం ఉగ్రవాదుల పాశవిక దాడితో ఛిన్నాభిన్నమైంది. బెంగళూరుకు చెందిన డాక్టర్ సుజాత కథ వింటే ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు. 2025 ఏప్రిల్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో సుజాత భర్త భరత్ భూషణ్ బలయ్యారు. ఆధార్ కార్డులను తనిఖీ చేసి, మతం అడిగి మరీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తన బిడ్డను వదిలేయమని భరత్ ప్రాధేయపడినా కనికరించకుండా అతని తలలోకి కాల్చారు. ఈ ఘోరాన్ని సుజాత, వారి మూడేళ్ల కుమారుడు కళ్లారా చూశారు. ఆ సమయంలో సుజాత, ఆమె బిడ్డ రక్తంతో తడిసిపోయామంటూ చెప్పుకొచ్చింది..

దాడి జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా సుజాత తన ఆవేదనను పంచుకున్నారు. తన భర్త భరత్ భూషణ్ ప్రాణాలు కోల్పోయిన పహల్గామ్ ఉగ్రదాడి జరిగి ఏడాది గడిచినా , డాక్టర్ సుజాత ఇప్పటికీ కాలాన్ని ముందు, తర్వాత అంటూ ఆలోచిస్తు్న్నారు. ఇప్పుడు మిగిలింది ఒక శూన్యమేనంటూ ఆమె కన్నీటి పర్యాంతమయ్యారు. నేను నా నవ్వును కోల్పోయాను.. నా భావోద్వేగాలను కోల్పోయాను అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన భరత్ ఆమెకు మానసిక ధైర్యాన్ని ఇచ్చేవారు. ఇప్పుడు ఆ తోడు లేకపోయినా, తన కుమారుడి కోసం ఆమె నిరంతరం కష్టపడుతున్నారు. ఎం.ఎస్. రామయ్య మెడికల్ కాలేజీలో పీడియాట్రీషియన్‌గా పని చేస్తూనే, మిగతా సమయాన్ని కొడుకుతో గడుపుతున్నారు.

క్లినిక్‌లో ఆమె పక్కన భరత్ భూషణ్ ఫోటో ఉంటుంది. అది ఒక నిశ్శబ్ద ఉనికిలా ఉంటూ, తన నిర్ణయాలకు మార్గనిర్దేశం చేస్తుందని అన్నారు. కానీ ఆ దాడి ఆమెపై దీర్ఘకాలిక నీడలా వెంటాడుతోందని చెప్పారు. దానిని తట్టుకోవడానికి ఉదయం నుండి రాత్రి వరకు తానను తాను ఏదో ఒక పనిలో నిమగ్నం చేసుకుంటానని చెప్పింది. ఖాళీగా ఉంటే, తన ఆలోచనలు మళ్లీ ఆ దృశ్యం వైపే వెళ్తాయి అని ఆమె అన్నారు. మేము పంచుకున్న సంతోషం కన్నా ఆ క్షణం తనపై ఎక్కువ భారం మోపుతోందని అన్నారు. ఆసుపత్రులలో ఎక్కువ గంటలు పనిచేసినా, ఫ్రీలాన్స్ కన్సల్టేషన్లు చేసినా, ఆదివారాలు మాత్రం ఆమె తన కొడుకు కోసమే కేటాయించుకుంటుంది. కారు నడుపుతున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు చుట్టుపక్కల ఎవరైనా గన్‌తో ఉన్నారేమో అని ఆమెకు అనిపిస్తుందట. ముందుకు కాదు, చెట్ల వైపు, మలుపుల వైపు, ఎవరైనా మమ్మల్ని లక్ష్యంగా చేసుకున్నారేమోనని ఆందోళన చెందుతూ ఉంటాను అంటూ ఆనాటి భయాన్ని వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి

ఆ నాటి దారుణాన్ని చూసిన చిన్నారి భరత్ ఇప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉంటున్నాడని సుజాత తెలిపారు. తండ్రి లేడనే నిజాన్ని అతను నెమ్మదిగా అర్థం చేసుకుంటున్నాడు. నాన్నకు దెబ్బ తగిలింది.. చాలా రక్తం వచ్చింది..అని చెబుతూనే ఉన్నాడు అని డాక్టర్ సుజాత చెప్పిన మాటలు అందరినీ కలచి వేశాయి. ఆ రోజు నుండి ఆ పిల్లవాడు ఒక్కసారి కూడా తన తండ్రిని అడగలేదు. వాడు తన తండ్రిలాగే చాలా ప్రశాంతంగా ఉంటాడు. నేను దగ్గర లేనప్పుడు అస్సలు మారాం చేయడు. నేను ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే అలా చేస్తాడు, అని ఆమె చిరునవ్వుతో అంటుంది. వాడు అంత మంచి ప్రవర్తన గల పిల్లవాడు అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. క్రమంగా, ఆ నష్టాన్ని అర్థం చేసుకోవడానికి ఆమె అతనికి సహాయం చేసింది. తన తండ్రి ఇక లేరని అతనికి తెలుసు. నేను అతనితో మాట్లాడుతూ, ఆడుకుంటూ, విషయాలు నేర్పిస్తూ ఉంటాను. నా కుటుంబం నాకు చాలా మద్దతు ఇస్తుంది అని చెప్పుకొచ్చారు. తన భర్తతో గడిపిన జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుంటే ఎలా ఉంటుందని అడిగినప్పుడు, అది తమ పెళ్లి రోజే అని ఆమె చెప్పింది. పహల్గామ్ ఘటన జరిగినప్పుడు వారికి పెళ్లై ఆరేళ్లయిందంటూ భావోద్వేగానికి లోనైంది.

ఒకప్పుడు వేడుకల మాసమైన ఏప్రిల్, ఇప్పుడు శోకమాసంగా మారింది. దాడి జరగడానికి కొన్ని రోజుల ముందే ఆ కుటుంబం భరత్ భూషణ్ పుట్టినరోజును జరుపుకుంది. మేము ఏప్రిల్ 14న కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లాలని అనుకున్నాము. మేము ఎప్పుడూ ముందుగా గుడికి వెళ్లి, ఆ తర్వాతే బయటకు వెళ్లేవాళ్లం. ఇప్పుడు, ఈ నెలను నేను ఎప్పటికీ మర్చిపోలేను. కాశ్మీర్‌లో భారీ భద్రతా ఏర్పాట్లు ఉన్నాయని తల్లిదండ్రుల ద్వారా విన్నందున, మొదట ఆ శబ్దం విన్నప్పుడు తాను పెద్దగా ఆందోళన చెందలేదని డాక్టర్ సుజాత చెప్పారు. మొదట, అవి టపాకాయలని మేము అనుకున్నాము. ఆ తర్వాత, భద్రతా సిబ్బంది దాన్ని చూసుకుంటారని నేను అనుకున్నాను, కానీ ఆ ప్రాంతంలో భద్రత లేదు. ఒక్క మనిషి కూడా లేడు. ఒక్క సాయుధ గార్డు అయినా ఉండి ఉంటే, దీనిని నివారించి ఉండవచ్చు. ఆమె మరో లోతైన సమస్యను కూడా ఎత్తిచూపుతున్నారు. అదే తీవ్రవాద భావజాలం. తాము చేస్తున్నది సరైనదేనని నమ్మేలా ఈ దాడి చేసేవారి మెదళ్లను కడిగివేయాలి. ఏదో ఒకటి మారాలి. అదెలాగో నాకు తెలియదు, కానీ ఇది ఇలాగే కొనసాగకూడదు.

ఉగ్రవాదం వల్ల ఒక పచ్చని కుటుంబం ఎలా బలి అవుతుందో డాక్టర్ సుజాత జీవితం ఒక ఉదాహరణ. అయినప్పటికీ, ఆమె తన కొడుకు కోసం చేస్తున్న పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకం. రాడికలైజేషన్ వల్ల జరుగుతున్న ఇలాంటి హింస ఆగాలని ఆమె గట్టిగా కోరుకుంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *