బిర్యానీ అనగానే చాలామందికి మాంసాహారమే గుర్తుకు వస్తుంది. అయితే మన దేశంలో అత్యధిక జనాభా శాఖాహారమే తీసుకుంటారు. మాంసాహార బిర్యానీకి ఉండే ప్రత్యేక రుచి వెజ్ బిర్యానీలో ఉండదని అనుకుంటే అది పొరపాటే. సరైన పద్ధతిలో వండితే, కూరగాయలతో చేసే బిర్యానీ కూడా అద్భుతమైన రుచిని ఘాటైన సువాసనను అందిస్తుంది. మీరు ఇంతకుముందు ఎప్పుడూ వంట చేయకపోయినా సరే, ఈ సులభమైన చిట్కాలను పాటిస్తూ అతి తక్కువ సమయంలోనే అదిరిపోయే వెజ్ బిర్యానీని సిద్ధం చేయవచ్చు.
కావాల్సిన పదార్థాలు:
ఉడికించిన అన్నం – 2 కప్పులు
మిశ్రమ కూరగాయల ముక్కలు (క్యారెట్, బీన్స్, బంగాళదుంప మొదలైనవి) – 3 కప్పులు
పసుపు – 1/2 టీస్పూన్
ధనియాల పొడి – 2 టీస్పూన్లు
తరిగిన ఉల్లిపాయలు – 1/4 కప్పు
అల్లం తురుము – 1 టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు – 5-6 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి – 1-2
జీలకర్ర – 1 టీస్పూన్
కారం – 1/2 టీస్పూన్
గరం మసాలా – 1/2 టీస్పూన్
బిర్యానీ మసాలా – 1 టీస్పూన్
నిమ్మరసం – 1 టీస్పూన్
నూనె – సరిపడా
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర – 2-3 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం:
మొదట ఒక గిన్నె తీసుకుని, అందులో బియ్యాన్ని వేసి ఉడికించుకోవాలి. అన్నం ఉడుకుతున్న సమయంలోనే తాజా కూరగాయలను చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి కొత్తిమీరను కూడా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేడి చేసి, అందులో ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత మిగిలిన కూరగాయ ముక్కలను కూడా వేసి బాగా వేయించుకోవాలి.
కూరగాయలు వేగిన తర్వాత పసుపు, ధనియాల పొడి, కారం రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం పూర్తిగా ఉడికిన తర్వాత దానిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాణలిలో కొంచెం కూరగాయల మిశ్రమం ఉంచి, దానిపై ఒక పొరలా అన్నాన్ని పరవాలి. ఆ అన్నం పైన మళ్ళీ కూరగాయల మిశ్రమాన్ని, దానిపై చివరిగా మిగిలిన అన్నాన్ని వేసి పైన మూత పెట్టాలి. మంటను మధ్యస్థంగా ఉంచి మరో 5 నుండి 7 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా వడ్డించాలి. దీనిని రైతాతో కలిపి తింటే రుచి ఇంకా అద్భుతంగా ఉంటుంది.