అమరావతి, ఏప్రిల్ 18: రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సెట్)లు ఏప్రిల్ 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ మధుమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా సెట్‌ల కన్వీనర్లతో ఈ మేరకు ఆయన ఏప్రిల్ 17 సమావేశం నిర్వహించారు. పరీక్షలు రాసే అభ్యర్థులు నిర్ణీత సమయం కంటే ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆయా సెట్ కన్వినర్లను ఆదేశించారు. విద్యుత్తు, ఆర్టీసీ, వైద్య, ఆరోగ్య, పోలీసు శాఖల సమన్వయంతో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అన్నారు.
ఏపీ సెట్స్ 2026 పూర్తి షెడ్యూల్ ఇలా..
- ఏపీ ఈసెట్ 2026 పరీక్ష తేదీ ఏప్రిల్ 23
- ఏపీ పీజీఈసెట్ 2026 పరీక్ష తేదీ ఏప్రిల్ 28, 30
- ఏపీ ఐసెట్ 2026 పరీక్ష తేదీ మే 2
- ఏపీ లాసెట్, పీజీ లాసెట్ 2026 పరీక్ష తేదీ మే 4
- ఏపీ ఎడ్‌సెట్ 2026 పరీక్ష తేదీ మే 8
- ఏపీ పీజీసెట్ 2026 పరీక్ష తేదీ మే 8 నుంచి 11 వరకు
- ఏపీ ఈఏపీసెట్ 2026 పరీక్ష తేదీ (ఇంజనీరింగ్) మే 12 నుంచి 15, 18 తేదీల్లో
- ఏపీ ఈఏపీసెట్ 2026 పరీక్ష తేదీ (అగ్రికల్చర్, ఫార్మసీ) మే 19, 20 తేదీల్లో
ఏపీ పీజీసెట్ మినహా మిగతా అన్ని పరీక్షలు రోజుకు రెండు విడతలుగా ఆన్‌లైన్ విధానంలో జరుగుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి విడత, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో విడత పరీక్షలు ఉంటాయి. పీజీసెట్ పరీక్ష మాత్రం ఉదయం 9 నుంచి 10.30 గంటలు, మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటలు, సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు మూడు విడతల్లో జరుగుతుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.