IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ వరుస ఓటములతో సతమతమవుతుంది. వేదికలు మారుతున్నా, ప్రత్యర్థులు మారుతున్నా.. కేకేఆర్ తలరాత మాత్రం మారడం లేదు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయిన తర్వాత కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే ఒక వింతైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఆటగాడిగా 100 ఓటములను చూసిన క్లబ్లో రహానే చేరిపోయాడు. అయితే రహానే ఎన్ని మ్యాచ్‌లు ఓడినా, విరాట్ కోహ్లీ సృష్టించిన ఒక ఘోర రికార్డును మాత్రం ఇప్పుడప్పుడే అందుకోలేడు.
రహానే ఖాతాలో 100వ ఓటమి
ఐపీఎల్ 2026 సీజన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చుక్కలు చూపిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్‌లలో కేకేఆర్ 4 ఓటములను చవిచూడగా, ఒక్కటి వర్షం వల్ల రద్దయింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడం ద్వారా అజింక్య రహానే తన సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్లో ఆటగాడిగా 100వ ఓటమిని నమోదు చేశాడు. ఈ చేదు జ్ఞాపకంతో అతను రవిచంద్రన్ అశ్విన్ సరసన నిలిచాడు. రహానే ఇప్పటి వరకు అనేక జట్లకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ, ఈ సీజన్ అతనికి కెప్టెన్‌గా పెద్ద పరీక్షగా మారింది.
విరాట్ కోహ్లీ అజేయ రికార్డు
ఐపీఎల్లో ఎక్కువ మ్యాచ్‌లు ఓడిన ఆటగాడిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఇప్పటి వరకు ఆటగాడిగా ఏకంగా 131 ఓటములను చూశాడు. ఈ లిస్టులో రోహిత్ శర్మ కేవలం ఒకే ఒక్క మ్యాచ్ వెనుకబడి 130 ఓటములతో రెండో స్థానంలో ఉన్నాడు. రహానే 100వ ఓటమితో ఈ రేసులోకి వచ్చినా, కోహ్లీ లేదా రోహిత్‌లను అందుకోవాలంటే అతను మరో 30 మ్యాచ్‌లు ఓడిపోవాలి. అంటే ప్రస్తుతానికి కోహ్లీ రికార్డు సురక్షితం అన్నమాట!
లిస్టులో ఇతర దిగ్గజాలు
ఎక్కువ మ్యాచ్‌లు ఓడిన టాప్ 5 ఆటగాళ్లలో అందరూ టీమిండియా సీనియర్లే ఉండటం విశేషం. దినేష్ కార్తీక్ 125 ఓటములతో మూడో స్థానంలో ఉండగా, ఎంఎస్ ధోనీ 120 ఓటములతో నాలుగో స్థానంలో ఉన్నాడు. రవీంద్ర జడేజా కూడా తక్కువ తినలేదు, అతను 113 ఓటములను తన ఖాతాలో వేసుకున్నాడు. శిఖర్ ధావన్ (108), భువనేశ్వర్ కుమార్ (106) కూడా ఈ అన్‌లక్కీ లిస్టులో కొనసాగుతున్నారు.
విదేశీ ఆటగాళ్లలో వార్నర్ టాప్
భారతీయ ఆటగాళ్లే కాకుండా విదేశీ ఆటగాళ్లలో కూడా ఒక స్టార్ ప్లేయర్ ఈ లిస్టులో ఉన్నాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్లో ఆటగాడిగా ఇప్పటి వరకు 104 ఓటములను చూశాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఓడిన విదేశీ ఆటగాడిగా వార్నర్ రికార్డు సృష్టించాడు. సాధారణంగా ఈ ఆటగాళ్లందరూ అత్యధిక మ్యాచ్‌లు ఆడటం వల్లే వారి ఖాతాలో ఓటముల సంఖ్య కూడా ఎక్కువగా కనిపిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..