ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి మరిన్ని ప్రీమియం మోడళ్లను తీసుకురావాలని ఆటోమొబైల్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈ పోటీలో JLR కూడా తనదైన వ్యూహంతో ముందుకెళ్తోంది. Baby Defender ఉత్పత్తి 2027లో ప్రారంభమవుతుందని సంస్థ సీఈఓ పీబీ బాలాజీ వెల్లడించారు. అయితే ఈ SUVకి సంబంధించిన పూర్తి వివరాలు, అధికారిక పేరు, ధర వంటి అంశాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. చిన్న పరిమాణంలో Defender అనుభూతిని కోరుకునే వారికి ఈ మోడల్‌పై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది.
డిఫెండర్ 90 కంటే చిన్నగా!
కొత్త Baby Defender తయారీ యూకేలోని మెర్సీసైడ్ ప్రాంతంలో ఉన్న హేల్‌వుడ్ ప్లాంట్‌లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఇదే ప్లాంట్‌లో Range Rover Evoque, Discovery Sport మోడళ్లను తయారు చేస్తున్నారు. Baby Defenderతో పాటు కొత్త Range Rover GT ఉత్పత్తి కూడా 2027లో మొదలవుతుందని పీబీ బాలాజీ తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న Defender 90, 110, 130 మోడళ్లతో పోలిస్తే కొత్త SUV పరిమాణం చిన్నదిగా ఉండనుంది. దీని పొడవు 4.5 మీటర్ల కంటే కొంచెం ఎక్కువగా ఉంటుందని అంచనా. ఫోర్ వీల్ డ్రైవ్ సదుపాయం కూడా ఉండే అవకాశం ఉంది. Defender Sport Electric లేదా Defender 80 అనే పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే అధికారికంగా పేరు ఖరారు కాలేదు.
EMA ప్లాట్‌ఫామ్‌పై ఎలక్ట్రిక్ SUV..
ఈ కొత్త ఎలక్ట్రిక్ SUVని JLRకు చెందిన Electric Modular Architecture (EMA) ప్లాట్‌ఫామ్‌పై నిర్మించనున్నారు. భవిష్యత్తులో రానున్న Range Rover Electric GT కోసం కూడా ఇదే ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించనున్నారు. బ్యాటరీ సామర్థ్యం, మోటార్ పవర్ వంటి వివరాలు ఇంకా వెల్లడించలేదు. పూర్తిగా ఎలక్ట్రిక్ వెర్షన్‌తో పాటు హైబ్రిడ్ మోడల్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. అయితే హైబ్రిడ్ వెర్షన్ ఎలక్ట్రిక్ మోడల్‌తో పాటే విడుదలయ్యే అవకాశం లేదు. Defenderకు ప్రధాన ఆకర్షణగా నిలిచే ఆఫ్‌రోడ్ సామర్థ్యాన్ని కొత్త మోడల్లోనూ కొనసాగించాలని సంస్థ భావిస్తోంది. అయితే బ్యాటరీని వాహనం అడుగుభాగంలో అమర్చడం వల్ల వీల్ ట్రావెల్, సస్పెన్షన్ కదలికల విషయంలో కొన్ని పరిమితులు ఎదురయ్యే అవకాశం ఉంది. చిన్న సైజు, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో రానున్న ఈ Baby Defender మార్కెట్లో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.