భట్టి విక్రమార్క అధ్యక్షతన కీలక సమీక్ష: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజాభవన్‌లో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఉన్నతాధికారులతో ప్రాజెక్టు పురోగతిని సమీక్షించారు. నిధుల సమీకరణ, నిర్మాణ పనుల క్యాలెండర్‌పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును ఐదు దశల్లో 55 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు. తొలి దశను రూ.7,055 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి నిధుల సమీకరణకు సంబంధించిన సాంకేతిక, ఆర్థిక చర్చలు పూర్తయ్యాయి. హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు, ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మొత్తం 21 కిలోమీటర్ల పరిధిలో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ప్రభావం లేని తొలి ఐదు కిలోమీటర్ల పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రులు ఆదేశించారు.