హైదరాబాద్, ఏప్రిల్ 19: హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజారవాణా వ్యవస్థను ప్రోత్సహించడంలో భాగంగా ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలు, పురుషులు సహా అందరికీ ఉచిత ప్రయాణం కల్పించేందుకు రేవంత్ సర్కార్ అనుమతి తెలిపింది. దీంతో అటు ప్రయాణికుల రవాణా ఖర్చులు తగ్గి ఆర్థికంగా దోహదపడుతుంది. ఇటు ట్రాఫిక్ తిప్పలూ తప్పుతాయ్. తెలంగాణ ఆవిర్భావ దినమైన జూన్ 2 నుంచి ఈ పథకాన్ని అమలుచేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర సర్కార్ దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాయగా సానుకూలంగా స్పందన వచ్చింది. ఎంఎంటీఎస్‌లో ఉచిత ప్రయాణ పథకాన్ని జూన్ 2 నుంచి ఏడాది పాటు అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఫలితాన్ని బట్టి కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఎంఎంటీఎస్ రైళ్ల ద్వారా ఏడాదికి దక్షిణ మధ్య రైల్వేకు రూ.10 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. దీంతో ఉచిత ప్రయాణ పథకం అమలు చేసే సమయంలో ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికుల సంఖ్యతో సంబంధం లేకుండా దక్షిణ మధ్య రైల్వేకు చెల్లించనుంది.
కొవిడ్ ముందు వరకు నిత్యం 121 రైళ్లలో 1.20 లక్షల మంది ప్రయాణించేవారు. ప్రస్తుతం 80 నుంచి 88 రైళ్లు తిరుగుతున్నాయి. ప్రయాణికుల సంఖ్య 38వేల నుంచి 42 వేలుగా ఉంది. ఎంఎంటీఎస్ రైళ్ల ఫ్రీక్వెన్సీ సరిగా లేకపోవడం, సమయపాలన లేకపోవడంతో జనాలు ఇతర ప్రత్యమ్నాయాలను చూసుకుంటున్నారు. అయితే ఎంఎంటీఎస్ రైళ్లలో అందరికి ఉచిత ప్రయాణం అమలుచేస్తే ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సర్కార్ భావిస్తుంది. ఈ మేరకు అనుమతి కోరుతూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా, పురపాలక అభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ జయేశ్‌రంజన్ దక్షిణ మధ్య రైల్వే జీఎంకు లేఖ రాశారు.
ఇందులో రద్దీ వేళ్లలో ఎంఎంటీఎస్ ట్రిప్పుల సంఖ్య పెంచాలని, టైంకు రైళ్ల రాకపోకలు సాగాలని కోరారు. అలాగే ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లలో సౌకర్యాలను మెరుగుపరచాలని అందులో తెలిపారు. ఈ పథకం అమల్లోకి వచ్చాక ప్రయాణికులు ఇంటి నుంచి స్టేషన్‌కు, స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లేందుకు వీలుగా ఆర్టీసీ షటిల్ బస్సులు నడుపుతామని, వాటికి రైల్వేస్టేషన్ల ప్రాంగణాల్లో స్థలాల్ని కేటాయించాలిని లేఖలో కోరారు. ఎన్ని రైళ్లు నడపాలి, ఏయే సమయాల్లో నడపాలన్నది దక్షిణ మధ్య రైల్వే నిర్ణయిస్తుందని, రైల్వేబోర్డు నిబంధనల ప్రకారం స్టేషన్లలో సౌకర్యాలు కల్పిస్తామని రైల్వే అధికారులు వివరించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.