కేవలం రెండు వేళ్లతో చేసే ఈ ఈజీ పరీక్ష ద్వారా మీ హెల్మెట్ సైజు కరెక్ట్‌గా ఉందో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు. తల చుట్టుకొలత కొలవడం, స్ట్రాప్‌లను సర్దుకోవడం, ఐదేళ్లకు ఒకసారి హెల్మెట్‌ను మార్చడం వంటి తప్పనిసరి జాగ్రత్తల గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.
2-2-2 రూల్ అంటే..
ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడటంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే అది తలకు సరిగ్గా సరిపోతుందో లేదో తెలుసుకోవడానికి నిపుణులు ‘2-2-2 రూల్’ను సిఫార్సు చేస్తున్నారు. దీన్ని మూడు దశల్లో సులభంగా పరీక్షించవచ్చు.
- మొదటిది, హెల్మెట్ ముందు భాగం మీ కనుబొమ్మలకు చాలా పైకి ఉండకూడదు. కనుబొమ్మల పైన సుమారు రెండు వేళ్ల దూరం ఉండేలా హెల్మెట్ అమరి ఉండాలి. అప్పుడే నుదురు మంచి రక్షణ పొందుతుంది.
- రెండోది, చెవి కింద పట్టీలను పరిశీలించాలి. మీ చెవి దగ్గర రెండు వేళ్లతో ‘V’ ఆకారంలో చేస్తే, హెల్మెట్ స్ట్రాప్‌లు కచ్చితంగా అదే ఆకారంలో ఉండాలి.
- మూడోది, చిన్ స్ట్రాప్‌ను బిగించిన తర్వాత మీ గడ్డానికి, స్ట్రాప్‌కు మధ్య కేవలం రెండు వేళ్లు మాత్రమే పట్టేంత ఖాళీ ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే వదులుగా, తక్కువ ఉంటే అసౌకర్యంగా ఉంటుంది.
సరైన సైజు ఎంపిక
చాలా పెద్ద హెల్మెట్ అయితే ప్రమాద సమయంలో తల నుంచి జారిపోయే ప్రమాదం ఉంది. అదే చిన్న సైజు అయితే తలనొప్పి, ఒత్తిడి కలిగిస్తుంది. కొత్త హెల్మెట్ కొనేముందు కనుబొమ్మల పైన టేప్‌తో తల చుట్టుకొలతను కొలిచి, కంపెనీ సైజింగ్ చార్ట్‌తో సరిచూసుకోవాలి. హెల్మెట్ ధరించిన తర్వాత తలను ఎడమ, కుడి వైపులకు కదిలించి చూడాలి. అది ఎక్కువగా కదలకూడదు. అలాగే చిన్ స్ట్రాప్ బిగించి ఉన్నప్పుడు హెల్మెట్‌తో పాటు ముఖ చర్మం కూడా కొద్దిగా కదిలితేనే అది సరైన ఫిట్ అని అర్థం.
హెల్మెట్ ఎప్పుడు మార్చాలి?
చాలామంది ఒకసారి కొన్న హెల్మెట్‌ను సంవత్సరాల తరబడి ఉపయోగిస్తుంటారు. కానీ నిపుణుల సూచన ప్రకారం సాధారణంగా ఐదేళ్లకు ఒకసారి హెల్మెట్ మార్చడం తప్పనిసరి. ఎండ, దుమ్ము, చెమట, నిరంతర వాడకం వల్ల లోపలి భాగం బలహీనపడుతుంది. ప్రమాదంలో ఒకసారి బలంగా తగిలినా లోపలి రక్షణ సామర్థ్యం తగ్గిపోతుంది. ప్రతి రైడ్‌కు ముందు కేవలం కొన్ని సెకన్లు కేటాయించి ఈ 2-2-2 రూల్ ప్రకారం హెల్మెట్‌ను చెక్ చేసుకోవడం ఒక మంచి అలవాటు. ఈ చిన్న జాగ్రత్తే ప్రమాద సమయంలో మీ ప్రాణాలను కాపాడే గొప్ప రక్షణ కవచంగా మారుతుంది.