మూవీ రివ్యూ: స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే
నటీనటులు: టామ్ హలండ్, జెండయా, సాడి సింక్, జాకబ్ బ్యాటలాన్ తదితరులు..
ఎడిటింగ్: నాట్ సాండర్స్, గిన సన్సమ్, హ్యారీ యూన్
సినిమాటోగ్రఫీ: బ్రెట్ పావ్లాక్
నిర్మాణ సంస్థ: మార్వెల్ స్టూడియోస్
దర్శకుడు: డెస్టిన్ డేనియల్ క్రెటన్
కథ:
పీటర్ పార్కర్ అనే వ్యక్తి ఉన్నాడనే విషయాన్ని ప్రపంచం మొత్తం మర్చిపోయాక.. స్పైడర్ మ్యాన్ పూర్తిగా ఒంటరివాడైపోతాడు. ప్రజల ప్రాణాలు కాపాడే బాధ్యతలో పడి, తనకంటూ ఓ సొంత జీవితం, సంతోషం లేకుండా చేసుకుంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ కూడా తన వల్ల ప్రమాదంలో పడుతుందని తెలిసి దూరంగా ఉంటాడు. మరోవైపు పీటర్ లవర్ MJ తన గతం పూర్తిగా మర్చిపోతుంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఒక భయంకరమైన కొత్త శత్రువు నగరంలోకి అడుగుపెడతాడు. దానివల్ల పాత గాయాలు మళ్లీ రేగుతాయి. తన శక్తులతో పాటు మానసిక ధృడత్వాన్ని కూడా పరీక్షించే ఈ కొత్త సవాళ్ల మధ్య పీటర్ ఎలా నెగ్గుకొచ్చాడు..? న్యూయార్క్ నగరాన్ని కాపాడుకునే ఈ పోరాటంలో అతను ఏం చేశాడు..? అనేది మిగతా కథ.
కథనం:
స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే సినిమా చేసిన మంచి పని ఏంటంటే.. గత చిత్రం ‘నో వే హోమ్’ సాధించిన భారీ విజయాన్ని మళ్లీ రిపీట్ చేయాలని చూడకపోవడం. పాత పాత్రలను తీసుకొచ్చి మ్యాజిక్ చేద్దామనే ఆలోచన పక్కనపెట్టి.. పీటర్ తన జీవితాన్ని సున్నా నుంచి ఎలా మొదలుపెట్టాడనే దానిపైనే దర్శకుడు పూర్తిగా దృష్టి పెట్టాడు. హీరో ఒంటరితనాన్ని కావాలని సానుభూతి కోసం వాడకుండా, కథలో చాలా సహజంగా కలిపేశాడు. దీనివల్ల అతనికి ఎదురయ్యే చిన్న కష్టం కూడా మనకు బాధను కలిగిస్తుంది, అతను సాధించే విజయం మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఎక్కడా హడావుడి పడకుండా, వరుస పెట్టి పేలుళ్లు, ఫైట్లు పెట్టకుండా, ఎమోషన్ పండాల్సిన చోట కథను నెమ్మదిగా నడిపించిన విధానం చాలా ఆకట్టుకుంటుంది. సినిమా బాగా మొదలవుతుంది. పెద్దగా గూస్బంప్స్ తెప్పించే సీన్స్ లేకపోయినా, పాత్రలను పరిచయం చేసిన విధానం, నెమ్మదిగా కథను నడిపించిన తీరు కట్టిపడేస్తుంది. ఈ సినిమాకి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్… రియలిస్టిక్ గా ఉండటం. మరో భారీ సూపర్ హీరో సినిమా లాగా కాకుండా, పీటర్ పడే కష్టాల మీద ఇది ఎక్కువ ఫోకస్ చేస్తుంది.
యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. ప్రతి ముఖ్యమైన సీన్‌ను VFX, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకో రేంజ్‌కు తీసుకెళ్లాయి. ఒకవైపు నవ్విస్తూనే, మరోవైపు మార్వెల్ అభిమానులు కోరుకునే యాక్షన్ ఇస్తూ, ఇంకోవైపు ముసుగు వెనక ఉన్న సాధారణ మనిషి బాధను ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో కథనం అద్భుతంగా బ్యాలెన్స్ అయింది. అయితే క్లైమాక్స్ కి వచ్చేసరికి కాస్త రొటీన్ మార్వెల్ ఫార్ములా కనిపించి, స్క్రీన్ మీద మరీ ఎక్కువ పాత్రలతో కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. కొన్ని ట్విస్టులు మరీ ఈజీగా అయిపోయినట్లు అనిపిస్తాయి. అలాగే ఒకరిద్దరు సహాయక నటులకు ఇంకాస్త స్క్రీన్ స్పేస్ ఇస్తే బాగుండేది. కానీ ఇవి సినిమాను కిందకు లాగేంత పెద్ద తప్పులైతే కావు. మొత్తానికి స్పైడర్ మ్యాన్ పాత్రను ఒక మెట్టు పైకి ఎక్కించి, మరింత పరిణతి చెందిన వాడిగా చూపించడంలో స్క్రీన్ ప్లే 100 శాతం సఫలమైంది.
నటీనటులు:
ఈ సినిమాకు అతిపెద్ద బలం టామ్ హాలండ్. స్పైడర్ మ్యాన్ పాత్రలో అతను పూర్తిగా ఒదిగిపోయాడు. ఒకవైపు అమాయకత్వం, నవ్విస్తూనే తనపై తనే జోకులు వేసుకోవడం, మరోవైపు ఎమోషనల్ సీన్స్‌లో కంటతడి పెట్టించడం అద్భుతంగా చేశాడు. ఎలాంటి భారీ హంగులు, మల్టీవర్స్ మ్యాజిక్ లేకుండానే తన నటనతో సినిమాను నిలబెట్టాడు. ఇప్పటివరకు అతను చేసిన స్పైడర్ మ్యాన్ సినిమాల్లో ఇదే అత్యుత్తమ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా చక్కగా నటించారు. సూపర్ హీరో గందరగోళం మధ్యలో కూడా కథలోని ఎమోషన్ ఎక్కడా దారి తప్పకుండా, మానవ సంబంధాల విలువ తెలిసేలా తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
టెక్నికల్ టీం:
ఈ మధ్య వచ్చిన కొన్ని మార్వెల్ సినిమాలతో పోలిస్తే.. దీని విజువల్స్ చాలా స్పష్టంగా, సహజంగా ఉన్నాయి. గ్రాఫిక్స్ మరీ అతిగా లేకుండా నీట్‌గా కుదిరాయి. గాల్లో వెబ్ విసురుకుంటూ వెళ్లే సీన్స్ థియేటర్లో ప్రేక్షకులతో కచ్చితంగా విజిల్స్ వేయిస్తాయి. ముఖ్యంగా యాక్షన్ కొరియోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రొటీన్ గ్రాఫిక్స్ ఫైట్స్ లా కాకుండా.. స్పైడర్ మ్యాన్ ఒరిజినల్ కదలికలకు, వేగానికి తగ్గట్టుగా ఫైట్స్ డిజైన్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ (BGM) కూడా ఎమోషనల్ సీన్స్‌లో మనసును కదిలించి, భారీ యాక్షన్ బ్లాక్స్‌లో థియేటర్ దద్దరిల్లేలా చేస్తుంది. ఎడిటింగ్ చాలా షార్ప్ గా ఉంది, దర్శకుడి పనితనం, కాన్ఫిడెన్స్ అడుగడుగునా కనిపిస్తుంది.
పంచ్ లైన్:
ఓవరాల్ గా స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే.. ది బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్..!