కొత్త బట్టలు కొనడం, వాటిని ప్యాకెట్ నుండి తీయడం అనేది ఒక తెలియని ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆ బట్టల రంగు, మెరుపు మనల్ని వెంటనే వాటిని ధరించాలనిపించేలా చేస్తాయి. చాలామంది కొత్త బట్టలు కొన్న వెంటనే ఉతకకుండానే వేసేసుకుంటారు. అయితే, ఆ కొత్త బట్టలు మీ చేతికి చేరడానికి ముందు ఎంత దూరం ప్రయాణించాయో, ఎన్ని చేతులు మారాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఫ్యాక్టరీలు, గిడ్డంగులు, షిప్పింగ్ కంటైనర్లు దాటుకుని మన దగ్గరకు వచ్చే క్రమంలో వాటిపై దుమ్ము, ధూళి మాత్రమే కాకుండా హానికరమైన బ్యాక్టీరియా కూడా చేరే అవకాశం ఉంది.
చర్మ సమస్యలకు ప్రధాన కారణం
బట్టల తయారీ సమయంలో వాటి రంగులు ఎక్కువ కాలం నిలిచి ఉండటానికి, మెరుపు కోసం రకరకాల రసాయనాలను, డైలను ఉపయోగిస్తారు. ఈ రసాయనాల అవశేషాలు బట్టలపైనే ఉండిపోతాయి. వీటి వల్ల చర్మంపై దద్దుర్లు, దురద వంటి అలర్జీలు వచ్చే ప్రమాదం ఉందని చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ ప్రియాంక హెమ్రజాని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి లేదా ఎగ్జిమా వంటి సమస్యలు ఉన్నవారికి ఇవి తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ రసాయనాల వల్ల చర్మంపై ఎర్రటి పొక్కులు వచ్చి, చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
తప్పనిసరిగా ఉతకాలి
శరీరానికి హత్తుకుని ఉండే లోదుస్తులు, వర్కవుట్ దుస్తులు వంటి వాటిని కొన్న వెంటనే ఖచ్చితంగా ఉతకాలి. ఎందుకంటే ఇవి నేరుగా చర్మంతో తాకుతూ, చెమటను పీల్చుకుంటాయి. దీనివల్ల రసాయనాలు చర్మంలోకి త్వరగా చొచ్చుకుపోయే అవకాశం ఉంది. అలాగే చిన్నపిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వారి చర్మం చాలా మృదువుగా ఉంటుంది కాబట్టి, ఉతకని బట్టలు వేయడం వల్ల వారికి త్వరగా రాషెస్ వస్తాయి. అందుకే పిల్లల బట్టలను మైల్డ్ డిటర్జెంట్ ఉపయోగించి ఉతికిన తర్వాతే వేయాలి.
కొన్ని మినహాయింపులు
అయితే అన్ని బట్టలను ఉతకడం సాధ్యం కాకపోవచ్చు. భారీ వర్క్ ఉన్న పెళ్లి బట్టలు లేదా డ్రై క్లీన్ మాత్రమే చేయాల్సిన సూట్లు వంటి వాటిని ఉతికితే వాటి రూపురేఖలు మారిపోవచ్చు. అటువంటి సందర్భాల్లో ఆ దుస్తులను కనీసం ఎండలో ఆరబెట్టడం లేదా వాటి కింద ఒక లేయర్ సాఫ్ట్ కాటన్ దుస్తులు ధరించడం ద్వారా చర్మానికి రక్షణ కల్పించవచ్చు. కొత్త బట్టలను ఉతకడం అనేది ఒక చిన్న అలవాటే కావచ్చు, కానీ అది మీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.