భారతీయ రోడ్లపై అత్యధికంగా కనిపించే స్కూటర్లలో సుజుకి యాక్సెస్ ఒకటి. తన క్లాసిక్ లుక్, నమ్మకమైన ఇంజన్ పనితీరుతో దశాబ్ద కాలంగా ఆకట్టుకుంటున్న ఈ జపనీస్ స్కూటర్, తాజాగా సేల్స్ రిపోర్ట్స్‌లో సరికొత్త రికార్డులను సృష్టించింది. హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ వంటి హేమాహేమీలకు గట్టి పోటీనిస్తూ మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. తాజాగా రుస్లాన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. సుజుకి యాక్సెస్ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగాయి.
మార్చి 2025లో 66,362 యూనిట్లు అమ్ముడవగా.. మార్చి 2026 నాటికి ఈ సంఖ్య 72,658 యూనిట్లకు చేరింది. కేవలం ఒక్క ఏడాదిలోనే 6,296 స్కూటర్లను సుజుకి అదనంగా విక్రయించగలిగింది. 9.49 శాతం అద్భుతమైన వృద్ధిని నమోదు చేసి, దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్ల జాబితాలో టాప్-3లో నిలిచింది. ప్రస్తుతం ఈ జాబితాలో హోండా యాక్టివా 2,59,670 యూనిట్లతో మొదటి స్థానంలో, టీవీఎస్ జూపిటర్ 2,24,771 యూనిట్లతో రెండవ స్థానంలో ఉన్నాయి. అయితే 125cc సెగ్మెంట్లో సుజుకి యాక్సెస్ ఇస్తున్న పోటీ మిగిలిన కంపెనీలను ఆలోచనలో పడేస్తోంది.
పవర్ఫుల్ ఇంజన్.. బడ్జెట్ ధర: సుజుకి యాక్సెస్ సక్సెస్‌కు ప్రధాన కారణం దాని 124cc ఫోర్ స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్. ఇది గరిష్టంగా 6.2 kW పవర్‌ను, 10.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పట్టణాల్లో ట్రాఫిక్ మధ్య ప్రయాణించడానికి ఈ పవర్ సరిగ్గా సరిపోతుంది. ధర విషయానికి వస్తే.. దీని ఎంట్రీ లెవల్ వేరియంట్ కేవలం రూ. 82,906 వద్ద లభిస్తోంది, ఇది మిడిల్ క్లాస్ బడ్జెట్‌కు అనుకూలంగా ఉంది.
ఎలక్ట్రిక్ రంగంలో సుజుకి మార్క్: పెట్రోల్ ధరలు మండిపోతున్న వేళ, సుజుకి తన ఎలక్ట్రిక్ వేరియంట్‌ను కూడా రంగంలోకి దించింది. ఇందులో శక్తివంతమైన 60 Ah, 3,072 kWh బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 95 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ ధృవీకరించింది. దీని ప్రారంభ ధర రూ.1,91,962. ఇకో ఫ్రెండ్లీ రైడింగ్ ఇష్టపడే వారికి ఇది మంచి ఆప్షన్.
గేమ్ ఛేంజర్ కాబోతున్న CNG వెర్షన్: త్వరలోనే స్కూటర్ మార్కెట్ రూపురేఖలను మార్చేస్తూ సుజుకి నుంచి CNG వెర్షన్ రాబోతున్నట్లు ఆటోమొబైల్ వర్గాల సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే, బజాజ్ ఫ్రీడమ్ తరహాలోనే స్కూటర్ సెగ్మెంట్లో ఇది ఒక విప్లవం కానుంది. ఒక కేజీ సీఎన్జీకి ఏకంగా 90 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని అంచనా. దీని ఎంట్రీ లెవల్ ధర సుమారు రూ.90,000 ఉండవచ్చని సమాచారం. సామాన్యుల జేబుకు చిల్లు పడకుండా, తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే వీలు కలగనుంది.




