Headlines

వాయమ్మో 4,000 కిలోమీటర్లా?.. తోడు కోసం అడవి కుక్కల అసాధారణ ప్రయాణం!


జాంబియాలో ఆఫ్రికన్ అడవి కుక్కల గుంపు ఒకటి రికార్డు స్థాయిలో సుమారు 4,000 కిలోమీటర్ల సుదూర ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఆఫ్రికాలో ఇప్పటివరకు నమోదైన ఘటనల్లో.. నేలపై సంచరించే ఓ జంతువు తోడు కోసం ఇంత దూరం ప్రయాణించడం ఇదే తొలిసారి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అద్భుతమైన ప్రయాణం.. వన్యప్రాణుల అసాధారణ సామర్థ్యాన్ని మాత్రమే కాదు.. అడవుల్లోకి మానవుల విస్తరణ పెరుగుతున్నప్పటికీ అవి ఎలా మనుగడ సాగిస్తున్నాయో కూడా చూపిస్తోంది. ఈ ప్రయాణాన్ని మూడు మగ అడవి కుక్కలు.. సోదరులు ఎనిమిది నెలల్లో పూర్తి చేశాయి. అవి బయలుదేరిన ప్రాంతం నుంచి చేరుకున్న ప్రాంతం వరకు నేరుగా ఉన్న దూరం కేవలం 418 కిలోమీటర్లు మాత్రమే. అయితే.. నేరుగా వెళ్లకుండా వంకరటింకర మార్గాల్లో వివిధ ప్రాంతాల మీదుగా ప్రయాణించడంతో.. మొత్తం దూరం దాదాపు పది రెట్లు పెరిగింది. జాంబియా రాజధాని లుసాకాతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలను కూడా ఈ అడవి కుక్కలు చాకచక్యంగా తప్పించుకుంటూ ముందుకు సాగాయి.

ఇలాంటి ప్రయాణాలను ‘డిస్పర్సల్’ అంటారు. అంటే.. ఆహారం లేదా వాతావరణ పరిస్థితుల కారణంగా కాలానుగుణంగా చేసే వలసలకు భిన్నంగా.. జోడు కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం. ఆఫ్రికన్ అడవి కుక్కలు గుంపులుగా జీవిస్తాయి. కలిసి వేటాడతాయి. కొత్త భూభాగాలను అన్వేషించడంతో పాటు.. ఇతర గుంపులతో జతకట్టే అవకాశాల కోసం కూడా విస్తృతంగా సంచరిస్తుంటాయి. పుట్టిన గుంపులోనే అవి జతకట్టడం సాధ్యం కాదు. దీంతో అవి పెద్దయ్యాక తమ గుంపులోనే ఆధిపత్యం సాధించాలి.. లేదంటే రెండేళ్లు, మూడేళ్ల వయసులో జోడు కోసం కొత్త ప్రాంతాలకు బయలుదేరాలి. అయితే.. ఈ అధ్యయనం అడవి కుక్కలు ఎదుర్కొంటున్న ప్రమాదాలను కూడా బయటపెట్టింది. GPS ట్రాకింగ్ ద్వారా చేపట్టిన పరిశోధనలో.. కొన్ని అడవి కుక్కలు వేటగాళ్లు అక్రమంగా ఏర్పాటు చేసిన ఉచ్చుల్లో చిక్కుకుని చనిపోయినట్లు గుర్తించారు.

మూడు ఆడ అడవి కుక్కలు కూడా ఇలాంటి అసాధారణ ప్రయాణాన్ని దాదాపు పూర్తి చేసే దశకు చేరుకున్నాయి. కానీ.. వాటిలో ఒకటి ఉచ్చులో చిక్కుకోవడంతో ఆ ప్రయాణం మధ్యలోనే ఆగిపోయింది. తోటి జంతువు చనిపోయిన తర్వాత.. మిగిలిన అడవి కుక్కలు పదేపదే అదే ప్రాంతానికి తిరిగి వస్తున్నట్లు కూడా పరిశోధకులు గుర్తించారు.

ఆఫ్రికన్ అడవి కుక్కలు ప్రపంచంలోనే అత్యంత అరుదైన వన్యప్రాణుల్లో ఒకటి. ప్రస్తుతం అక్కడి అడవుల్లో సుమారు 6,000 అడవి కుక్కలు మాత్రమే మిగిలి ఉన్నట్లు అంచనా. మోంటానా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఈ పరిశోధన పత్రం ప్రధాన రచయిత స్కాట్ క్రీల్ 1991 నుంచి ఆఫ్రికన్ అడవి కుక్కలపై అధ్యయనం చేస్తున్నారు. ఈ తాజా అధ్యయనం కొత్త ఆశను కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. తూర్పు, దక్షిణ ఆఫ్రికాలోని అడవి కుక్కలు గతంలో భావించిన దానికంటే ఎక్కువగా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండే అవకాశం ఉందని పరిశోధన సూచిస్తోంది. ఈ అధ్యయనం పూర్తి వివరాలు ‘ఎకాలజీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. తోడు కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించిన ఈ అడవి కుక్కల కథ.. వాటి అసాధారణ సామర్థ్యాన్ని మాత్రమే కాదు.. వాటి సంరక్షణ ఎంత కీలకమో కూడా గుర్తుచేస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *