Headlines

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. రుక్మిణి కోట సంచలన ప్రకటన!


ఏపీలో జనసేన నేతల పేర్లు ఉపయోగించి నిరుద్యోగుల నుంచి రూ.7కోట్లు వసూలు చేసిన కేసులో సీఐడీ దూకుడు పెంచింది. జనసేన నేతలు కోటా రుక్మిణి, కళ్యాణం శివ శ్రీనివాస్ పేర్లు ఉపయోగించి 35 మంది దగ్గర నుంచి.. ధరణీ కృష్ణ, పెద్దిరాజు ఏడు కోట్ల రూపాయలు వసూలు చేశారని తేల్చారు. జనసేన నేతల ఫిర్యాదుతో ధరణీ కృష్ణ, పెద్దిరాజులపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. డబ్బుల వసూలు వ్యవహారంలో ధరణీ కృష్ణ, పెద్దిరాజును ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.

రూ.7 కోట్ల స్కాంపై జనసేన నేత కోట రుక్మిణి స్పందించారు. తన మౌనం సంయమనం.. సహనం నా బలం అంటూ ప్రకటన విడుదల చేశారు. కొన్నాళ్లుగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారని, తప్పుడు కథనాలతో వృత్తిపరమైన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని చెప్పారు. తన పేరు, సంస్థను ఉపయోగించుకుని కొందరు లబ్ధిపొందారని వివరించారు. తనకు తెలియకుండా మోసం జరిగిందని, అంతర్గత విచారణ తర్వాత ఉద్యోగిని తొలగించామన్నారు. వ్యక్తిగత ప్రతిష్ఠ, కుటుంబ గౌరవం కోసం న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. పవన్ సహనం, పట్టుదల, ధైర్యమే తనకు స్ఫూర్తి అని చెబుతూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు కోట రుక్మిణి. అసలు నిందితులను వదిలి నన్ను టార్గెట్ చేస్తున్నారని, ఈ కేసులో చర్యలు తీసుకోవాలని పోలీసులకు తానే ఫిర్యాదు చేశానన్నారు. ఈ వివాదంలోకి పవన్‌ పేరును లాగొద్దని కోరారు. ఇదంతా ఓ కుట్ర ప్రకారం జరుగుతోందన్నారు పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కల్యాణం శ్రీనివాస్‌. కావాలని తమపై బురద జల్లుతున్నారని ఆరోపించారు.

జనసేన నేతల పేర్లు చెప్పి.. ఉద్యోగాల పేరుతో కోట్లు వసూలు చేయడంపై విపక్షం విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే.. ఈ విషయాన్ని అటు జనసేన, ఇటు ప్రభుత్వం సైతం సీరియస్‌గా తీసుకుంది. సీఐడీతో ఎంక్వైరీకి జరుపుతుండటంతో.. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారనేది తేల్చే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *