Headlines

యుద్ధం ఏదైనా.. భారం పడనివ్వను.. రైతులకు, దేశ ప్రజలకు ప్రధాని మోదీ గ్యారెంటీ..!

యుద్ధం ఏదైనా.. భారం పడనివ్వను.. రైతులకు, దేశ ప్రజలకు ప్రధాని మోదీ గ్యారెంటీ..!


హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు, యుద్ధ మేఘాలు దేశంపై చూపుతున్న ప్రభావాన్ని వివరిస్తూనే, సామాన్యుడిపై భారం పడకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచం ఎన్నో సవాళ్లను, సంక్షోభాలను ఎదుర్కొంటోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ముఖ్యంగా పశ్చిమాసియా సంక్షోభం, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నదని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత్ కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితం కాకూడదని, ఈ సంక్షోభాలను అధిగమించి దేశ ప్రయోజనాల కోసం ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నా, భారతీయ రైతులపై ఆ భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం రక్షణ కవచంలా నిలుస్తోందని మోదీ స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో యూరియా ధరలు భారీగా పెరిగినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఒక్కో బస్తా యూరియాను సుమారు రూ. 3,000 వెచ్చించి కొనుగోలు చేస్తోంది. ప్రభుత్వం ఇంత భారీ ధరకు కొనుగోలు చేసినా, రైతులకు మాత్రం పాత ధరలకే అందిస్తోంది. ఈ అదనపు భారాన్ని అంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని ప్రధాని మోదీ వివరించారు.

యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయని, పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశంపై తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రజలపై భారం పడకుండా గత రెండు నెలలుగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ప్రధాని తెలిపారు. “యుద్ధం కారణంగా వచ్చే ఆర్థిక నష్టాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది తప్ప, ధరలను పెంచి సామాన్య ప్రజలపై ఆ భారాన్ని వేయడం లేదు” అని ప్రదాని నరేంద్ర మోదీ వెల్లడించారు. “అంతర్జాతీయ సంక్షోభాల నుంచి భారత్‌ లాభపడాలి.. ఈ పరిస్థితులను అధిగమించాలి..ఇందుకోసం మన వంతు పాత్ర పోషించాలి.. అప్పుడే మన దేశానికి ప్రయోజనం. ప్రతి భారత పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే, ఈ సంక్షోభం నుంచి బయటపడతాం.. ఇదే సంకల్పం తీసుకుని అందరూ పనిచేయాలని” ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు

భారతదేశం ఈ సంక్షోభం నుంచి మరింత బలంగా బయటపడాలని, అందుకు ప్రజలందరి సహకారం అవసరమని ప్రధాని ఆకాంక్షించారు. అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి ప్రతి ఒక్కరూ సంకల్పంతో పనిచేయాలని కోరుతూ తన ప్రసంగాన్ని ముగించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *