రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని పారేయకుండా, ఉదయానికి ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్పాహారంగా మార్చుకోవచ్చు. రాత్రి మిగిలిన అన్నానికి బియ్యప్పిండికి కలిపి మెత్తటి రొట్టెలు తయారు చేసుకోవడం చాలా సులభం. నూనె వాడకపోవడం వల్ల ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ నూనె లేని బియ్యపు రొట్టెలను కారంగా ఉండే టమాటా లేదా కొబ్బరి చట్నీతో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. తక్కువ సమయంలో, ఇంట్లోని తక్కువ పదార్థాలతో చేసుకునే ఈ వంటకం ఆహారాన్ని వేస్ట్ చేయకుండా ఆరోగ్యకరమైన టిఫిన్ తయారు చేసుకోవడానికి చక్కటి పరిష్కారం. తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం..
కావాల్సిన పదార్థాలు..
రాత్రి మిగిలిన అన్నం: 1 కప్పు
బియ్యప్పిండి: 1 కప్పు
ఇవి కూడా చదవండి
పచ్చిమిర్చి: 2 లేదా 3 (లేదా చిల్లీ ఫ్లేక్స్)
ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం:
ముందుగా మిగిలిపోయిన ఒక కప్పు అన్నాన్ని, పచ్చిమిర్చి మరియు సరిపడా ఉప్పుతో కలిపి మిక్సీ జార్‌లో వేయాలి. దీనికి చుక్క నీరు కూడా కలపకుండా మెత్తటి పేస్ట్‌లా రుబ్బుకోవాలి. ఈ అన్నం పేస్ట్‌ను ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని, దానిలో ఒక కప్పు బియ్యప్పిండిని కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి. అన్నంలో ఉన్న తేమతోనే పిండి ముద్దలా తయారవుతుంది. కాబట్టి, నీళ్లు పొయ్యాల్సిన అవసరం లేదు. పిండిని చపాతీ పిండిలా గట్టిగా కలుపుకున్న తర్వాత, దానిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. దీనివల్ల పిండి మెత్తబడి రొట్టెలు బాగా వస్తాయి.
10 నిమిషాల తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. కొద్దిగా పొడి బియ్యప్పిండి చల్లుకుంటూ చపాతీలా రుద్దుకోవాలి. స్టవ్‌పై పెనం పెట్టి బాగా వేడెక్కనివ్వాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, రొట్టెను రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు నూనె లేదా నెయ్యి లేకుండా కాల్చాలి. హై ఫ్లేమ్‌లో కాల్చితే రొట్టెలు గట్టిపడతాయి, అందుకే మీడియం ఫ్లేమ్‌లోనే కాల్చుకోవాలి.
ఈ నూనె లేని రొట్టెలకు కాంబినేషన్‌గా రోస్టెడ్ టమాటా-ఎండుమిర్చి చట్నీ లేదా అల్లం-కొబ్బరి కారం చట్నీ నంజుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. మిగిలిపోయిన అన్నాన్ని వృథా చేయకుండా, తక్కువ సమయంలో, ఎలాంటి నూనె లేకుండా చేసుకునే ఈ టిఫిన్ జీర్ణక్రియకు చాలా మంచిది. బ్యాచిలర్స్, ఆఫీస్‌కు త్వరగా వెళ్లాలనుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ బ్రెక్‌ఫాస్ట్!
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..