కరోనా మహమ్మారి ప్రభావం నుంచి ప్రపంచం పూర్తిగా కోలుకోక ముందే మరో కొత్త వేరియంట్ జనాలను భయపెడుతోంది. JN.1 ఫ్యామిలీకి చెందిన PJ.2.1 అనే కొత్త వేరియంట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ పర్యవేక్షణలో ఉన్న వేరియంట్ల జాబితాలో చేర్చింది. నవంబర్ 8 నాటికి 18 దేశాల్లో ఈ వేరియంట్ వ్యాప్తి ఉన్నట్టు WHO గుర్తించింది. ముఖ్యంగా కెనడా, అమెరికా వంటి దేశాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు స్పష్టం చేసింది. అయితే కరోనాతో పోల్చుకుంటే దీని ముప్పు తక్కువగానే ఉండొచ్చని WHO పేర్కొంది.
PJ.2.1 అంటే ఏమిటి?
PJ.2.1 అంటే ఇది కూడా JN.1 కుటుంబానికి చెందిన కోవిడ్-19 కొత్త వేరియంట్. వైరస్ మానవ కణాలకు అతుక్కోవడానికి సహాయపడే స్పైక్ ప్రోటీన్‌లో ఇది 24 మార్పులను కలిగి ఉంది. శాస్త్రవేత్తలు దీనిని సాల్టేషన్ వేరియంట్‌గా పిలుస్తున్నారు. అంటే ఇది కొద్ది కొద్ది జన్యుమార్పులు చేయకుండా ఒకేసారి భారీ ఎత్తున జన్యు మార్పులతో ఉద్భవించిందని అర్థం. కేవలం స్పైక్ ప్రోటీన్‌లోనే 24 అమైనో యాసిడ్ మార్పులు ఉండటం వల్ల PJ.2.1 అత్యధిక మ్యుటేషన్లు కలిగిన వేరియంట్‌గా నిలుస్తోందని WHO పేర్కొంది.
18 దేశాలకు వ్యాప్తి
ఈ కొత్త వేరియంట్‌కు సంబంధించిన తొలి కేసు 2026 మే 2న కెనడాలోని ఒంటారియోలో నమోదైనట్టు పేర్కొంది. ఇది క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించిందని.. జూన్ 30న అమెరికాలోని న్యూయార్క్‌లో కూడా ఈ వేరియంట్‌ను గుర్తించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది కెనడా, అమెరికాతో పాటు స్పెయిన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లోనూ విస్తరిస్తున్నట్టు సమాచారం.
మానవ కణాల్లోకి సులభంగా ప్రవేశిస్తుందా?
కోవిడ్ వేరియంట్‌తో పోల్చుకుంటే ఈ కొత్త వేరియంట్ మరింత స్పీడ్‌గా మానవ కణాల్లోకి ప్రవేశిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. జర్మన్ ప్రైమేట్ సెంటర్ పరిశోధకులు అక్టోబర్ 24న ‘జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్’లో పబ్లిష్ అయిన అధ్యయనం ప్రకారం.. ఈ వేరియంట్ కొన్ని కణాల్లోకి, బాడీలోకి ప్రవేశిస్తున్నట్టు తేలింది. కానీ ఇది కరోనా అంత స్పీడ్‌గా వ్యాప్తి చెందలేదని తెలిపింది.
PJ.2.1పై వ్యాక్సిన్లు పనిచేస్తాయా?
అయితే ఈ కొత్త వేరియంట్‌ను వ్యాక్సిన్‌తో అడ్డుకునేందుకు కొన్ని అధ్యయనాలు చేయగా.. LP.8.1-అడాప్టెడ్ వ్యాక్సిన్ నుంచి ఇతర వేరియంట్లతో పోలిస్తే PJ.2.1 యాంటీబాడీల నుంచి ఎక్కువగా తప్పించుకోలేకపోయినట్లు గుర్తించారు. మరో అధ్యయనంలో 22 మందిని పరిశీలించారు. XFG-అడాప్టెడ్ mRNA వ్యాక్సిన్ తీసుకున్న 14 రోజుల తర్వాత PJ.2.1కి వ్యతిరేకంగా వారి యాంటీబాడీ స్థాయిలు 2.8 రెట్లు పెరిగినట్టు గుర్తించారు. అయితే, ప్రయోగశాలల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా మాత్రమే వ్యాక్సిన్లు వాస్తవ పరిస్థితుల్లో ఇన్ఫెక్షన్ లేదా తీవ్రమైన అనారోగ్యాన్ని ఎంతవరకు అడ్డుకుంటాయో పూర్తిగా నిర్ధారించలేమని WHO పేర్కొంది.
వ్యాధి తీవ్రత ఎంత? లక్షణాలు ఎలా ఉంటాయి?
అయితే ఈ PJ.2.1 వేరియంట్ వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవు. అలాగే ఈ వేరియంట్ కొత్త లక్షణాలను కూడా ఇంకా గుర్తించలేదు. ఈ వేరియంట్ సోకినా సాధారణ కోవిడ్ లక్షణాలు మాత్రమే కనిపించవచ్చు. అయితే ఈ వేరియంట్ సోకిందా లేదా అని కేవలం జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా మాత్రమే నిర్ధారించవచ్చని WHO తెలిపింది.
ఆందోళన చెందాలా? WHO ఏం చెబుతోంది?
అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం.. PJ.2.1 కొత్త వేరియంట్ వల్ల పెద్ద ప్రమాదం ఏమీ లేదని WHO అంచనా వేసింది. కానీ దీని వ్యాప్తిని నిశితంగా గమనించాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. ముఖ్యంగా వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, మధుమేహం, గుండె లేదా ఊపిరితిత్తుల వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి
కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని WHO తెలిపింది. జ్వరం, దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలని పేర్కొంది.